Telangana : సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య జలజగడం ప్రారంభమయింది. తెలంగాణలో కృష్ణా నదీ జలాల పంపిణీ మరియు నాగార్జున సాగర్ నీటి మళ్లింపు అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వివాదం తీవ్రమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, గత ప్రభుత్వ ఒప్పందాలు మరియు ప్రస్తుత ప్రభుత్వ చర్యలపై ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతులకు నష్టం కలిగించేలా.. ఏపీకి అనుకూలంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయగా, దానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి కృష్ణా జలాలను ధారాదత్తం చేసింది మీ హయాంలోనే అంటూ ఉత్తమ్ ఎదురుదాడికి దిగారు. నీటి సెంటిమెంట్ ఇప్పుడు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణలివే...
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.. తాగునీటి పథకం ముసుగులో విజయపురి సౌత్ వద్ద సొరంగం తవ్వి, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా సుమారు 90 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. చంద్రబాబు సర్కార్ కు రేవంత్ ప్రభుత్వం తలవంచిందని కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ అక్రమ పనులను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు ఫిర్యాదు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీటి ముప్పు వాటిల్లుతోందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం కృష్ణా బోర్డుకు లేఖ రాయడంతో పాటు, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వాదన ఇదే...
బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర నేతలు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ నీటి హక్కులకు తీరని నష్టం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు (34 శాతం), ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం) ఉండేలా 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించి తెలంగాణకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కృష్ణా బేసిన్ లో బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఒప్పుకున్న 34:66 నిష్పత్తిని తమ ప్రభుత్వం అధికారికంగా తిరస్కరించిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పరీవాహక ప్రాంతం, కరవు ప్రాంతాల ఆధారంగా తెలంగాణకు 71 శాతం (575 టీఎంసీలు) వాటా దక్కాలని కేంద్ర జలశక్తి శాఖకు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా నీటిని తరలించుకున్నా పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. నీటి మళ్లింపును అరికట్టేందుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద సెంటిమెంట్ ను తిరిగి రగిలించే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉండగా, దానికి కాంగ్రెస్ కౌంటర్ తిప్పుకొడుతోంది.

