Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లండన్‌లో ఘనంగా టీపీఎల్‌-2026 ప్రారంభం

లండన్‌లో ఘనంగా టీపీఎల్‌-2026 ప్రారంభం

TeluguPost.com 5 days ago

లండన్‌: లండన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీఏఎల్‌) తన 2026 క్రీడా సీజన్‌ను అధికారికంగా ప్రారంభించింది. మే 16న లండన్‌లోని లీఈఏ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో టీఏఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) 2026 17వ ఎడిషన్‌ను ఘనంగా ప్రారంభించారు.

2009లో టీఏఎల్‌ ప్రారంభించిన ఈ టోర్నమెంట్‌ ప్రస్తుతం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి చెందిన ప్రముఖ క్రీడా వేదికల్లో ఒకటిగా నిలిచింది. ప్రతి ఏడాది ఆటగాళ్లు, కుటుంబాలు, అభిమానులను క్రీడలు, సామాజిక కార్యక్రమాల ద్వారా ఒక్కచోట చేర్చుతోంది.

ఈసారి టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. లీగ్‌ దశ 15 వారాల పాటు సాగనుంది. మహిళల విభాగం, అండర్‌-16 బాలుర పోటీలు, సాఫ్ట్‌బాల్‌ టెన్నిస్‌, హార్డ్‌బాల్‌ టెన్నిస్‌ నిర్వహించనున్నారు. ఫైనల్‌ను ఆగస్టు 16న నిర్వహించనున్నారు.

ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు టీఏఎల్‌ డైరెక్టర్‌ బృందం శుభాకాంక్షలు తెలిపింది. తెలుగు ప్రజలను ఒకచోట చేర్చే సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల నిర్వహణలో టీఏఎల్‌ ఎప్పటికీ ముందుంటుందని పేర్కొన్నారు. కుటుంబాలు, స్నేహితులు కలుసుకునే వేదికలను సృష్టించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ట్రస్టీ సత్య దేవినేని, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి సింధూర చెరుకు సహా వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ట్రస్టీ బోర్డు సభ్యులు సత్య దేవినేని, అశోక్‌ మార్తి, వెంకట్‌ మూలా, రాజ్‌ చెరుకూరి, అనిల్‌ అనంతుల సహకారాన్ని అభినందించారు.

క్రీడా కార్యక్రమాలతో పాటు టీఏఎల్‌ "100 రోజుల్లో 1 మిలియన్‌ అడుగులు" పేరుతో ప్రత్యేక కమ్యూనిటీ ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా పాల్గొనేవారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు తెలుగు సంస్థలు, సమాజ సేవా కార్యక్రమాలకు నిధులు సమీకరించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని వెంకట్‌ తోటకూర, స్నేహా అరిగె, సుజాత అరిగె, సింధూర చెరుకు సమన్వయం చేస్తున్నారు. మరింత మంది సభ్యులు పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కలుపుతూ ఆరోగ్యం, జట్టు భావన, సామాజిక బంధాలను టీఏఎల్‌ మరింత బలోపేతం చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu