పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయడం లేదని మమత బెనర్జీ తెలిపారు. బెంగాల్ ఎన్నికలు ముగిశాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో మెజారిటీ సాధించి ఈ నెల 9వ తేదీన కొత్త ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో మమత బెనర్జీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాను బీజేపీతో పోరాడలేదని,ఆ పార్టీ కోసం పనిచేసిన ఎన్నికల సంఘానితో పోరాడనని తెలిపారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎన్నడూ చూడలేదని మమత బెనర్జీ చెప్పుకొచ్చారు. కుట్ర వల్లనే తాను ఓటమి పాలయ్యానని ప్రజాతీర్పు వల్ల కాదని మమత బెనర్జీ తెలిపారు. లోక్ భవన్ కు వెళ్లనని, రాజీనామా చేయనని తెగేసి చెప్పారు.
ఎన్నికల సంఘమే విలన్...
తనకు ముఖ్యమైన నేతలందరూ ఫోన్ చేస్తున్నారని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అఖిలేశ్ యాదవ్ లు ఫోన్ చేసి తనకు సంఘీభావాన్ని తెలిపారు. తాను ఇండి కూటమి బలోపేతానికి పనిచేస్తానని మమత బెనర్జీ తెలిపారు.ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరగలేదని, ఈవీఎంలను తారుమారు చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 90 శాతం ఛార్జింగ్ ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని తాను విలన్ గానేచూస్తున్నానని మమత బెనర్జీ తెలిపారు. ఇదెలా సాధ్యమవుతుందని దీదీ ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ప్రారంభించారని మమత బెనర్జీ చెప్పారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందునే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ప్రారంభమయిందన్న మమత అన్ని చోట్ల సోదాలను నిర్వహించి ఈసీ అరాచకం సృష్టించిందన్నారు.
ఎన్నికల అనంతరం హింసతో...
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులందరినీ మార్చారని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించి వారి చేత ఎన్నికలను నిర్వహించారని చెప్పారు. బీజేపీ ఎన్నికల సంఘంతో కలసి పెద్ద గేమ్ ఆడిందన్నారు మమత బెనర్జీ. ఎస్.ఐ.ఆర్ పేరిట తమ పార్టీకి చెందిన తొంభయిల లక్షల ఓట్లను తొలగించడమే కాకుండా, ఓట్ల లెక్కింపులోనూ భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పారు. వంద అసెంబ్లీ స్థానాల్లో గెలుపును తారుమారు చేశారన్నమమత బెనర్జీ తమ పార్టీకి చెందిన నేతల మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి లెక్కింపు ప్రక్రియను ఆలస్యంగా చేపట్టారని మమత ఫైర్ అయ్యారు. అందుకే ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నిజానిజాలను నిగ్గుతేల్చడానికి పది మంది సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని నియమించామని చెప్పారు. ఇదొక బ్లాక్ డే అని మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

