Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mexico Cartel Violence : మెక్సికోలో నరమేధం...కరడుగట్టిన   ముఠా నేత అరెస్ట్‌

Mexico Cartel Violence : మెక్సికోలో నరమేధం...కరడుగట్టిన ముఠా నేత అరెస్ట్‌

TeluguPost.com 12 hrs ago

Guasave : మెక్సికోలోని సినాలోవా రాష్ట్రం కాల్పులు, హెలికాప్టర్ల శబ్దాలు, తగలబడుతున్న వాహనాలతో దద్దరిల్లింది. కరడుగట్టిన డ్రగ్స్‌ ముఠా నేత ఫౌస్టో ఇసిడ్రో మెజా ఫ్లోరెస్‌ అలియాస్‌ 'ఎల్‌ చాపో ఇసిడ్రో'ను భద్రతా బలగాలు అరెస్ట్‌ చేశాయి.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ముఠా సభ్యులు, సైనికుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అనుమానిత ముఠా సభ్యులు, నలుగురు మెక్సికో సైనికులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అత్యంత వాంఛిత నేరస్థుల జాబితాలోని పది మందిలో మెజా ఫ్లోరెస్‌ కూడా ఉన్నాడు. అరెస్ట్‌ అనంతరం శనివారం అతడిని విమానంలో మెక్సికో నగరానికి తరలించారు. గ్వాసావేలో జరిగిన కాల్పులతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.మెజా ఫ్లోరెస్‌ తొలుత బెల్ట్రాన్‌ లేవా కార్టెల్‌లో కీలక స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత సొంతంగా మెజా-ఫ్లోరెస్‌ ట్రాన్స్‌నేషనల్‌ క్రిమినల్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. అమెరికాకు డ్రగ్స్‌ సరఫరా చేయడంతో పాటు అక్రమంగా తుపాకులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. అతడి ఆచూకీ తెలిపి అరెస్ట్‌కు సహకరించిన వారికి అమెరికా ప్రభుత్వం 5 మిలియన్‌ డాలర్ల బహుమతి ప్రకటించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి చెందిన నిఘా సమాచారం మెజా ఫ్లోరెస్‌ అరెస్ట్‌కు సహకరించినట్లు మెక్సికో ప్రభుత్వం శనివారం ఉదయం వెల్లడించింది. అయితే ఇరు దేశాల అధికారులు ఎలా సమన్వయం చేసుకున్నారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. సినాలోవా కార్టెల్‌లోని 'లాస్‌ మాయోస్‌' వర్గానికి కూడా మెజా ఫ్లోరెస్‌ కీలక మిత్రుడు. గతేడాది ట్రంప్‌ ప్రభుత్వం ఈ వర్గాన్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ప్రస్తుతం సినాలోవా రాష్ట్రంపై ఆధిపత్యం కోసం కార్టెల్‌లోని మరో వర్గంతో ఈ గ్రూపు పోరాడుతోంది. మెజా ఫ్లోరెస్‌ అరెస్ట్‌ ఆ వర్గానికి ఎదురుదెబ్బగా మారింది.

గ్వాసావేలో భీతావహ పరిస్థితులు...శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గ్వాసావేలో మెజా ఫ్లోరెస్‌తో పాటు అతడి రెండో స్థాయి నేతను పట్టుకునేందుకు భద్రతా బలగాలు దాడి చేశాయి. దీంతో కాల్పులు మొదలయ్యాయి. సుమారు 2.90 లక్షల జనాభా ఉన్న పట్టణమంతా తుపాకీ మోతతో వణికిపోయింది. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. పట్టణంలోని కీలక ప్రాంతాలపై హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరిపారు.బేస్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కాల్పులు మొదలవడంతో ప్రజలు కేకలు వేస్తూ పరుగులు తీసిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. కార్లు, దుకాణాలకు నిప్పంటించారు. హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ కింద ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపాయి. ముఠా నేతలు అరెస్టయినా, హతమైనా ఆయా గ్రూపులు ఇలా బలప్రదర్శనకు దిగడం మెక్సికోలో సాధారణమే.''గ్వాసావే అంతటా పోరాటం సాగింది. నగరమంతా కాల్పులు వ్యాపించాయి'' అని స్థానిక జర్నలిస్టు అల్మా కమాచో చెప్పారు.మెజా ఫ్లోరెస్‌ ఉన్న భవనం చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ఆకస్మికంగా దాడి చేసినట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు. అనుమానిత ముఠా సభ్యులు తుపాకులు, పేలుడు పదార్థాలతో బలగాలపై దాడి చేయడంతో సైనికులు ఓ ఇంట్లోకి ప్రవేశించి మెజా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరో ఇద్దరిని సాయుధ సైనికులు సైనిక విమానం వద్దకు తీసుకెళ్తున్న దృశ్యాలను మెక్సికో రక్షణ శాఖ విడుదల చేసింది. మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కాల్పులు, దాడులు కొనసాగడంతో మెజా ఫ్లోరెస్‌ను గ్వాసావే నుంచి తరలించేందుకు సైన్యం, నేషనల్‌ గార్డ్‌ ప్రత్యేక బలగాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు గానీ అతడిని అక్కడి నుంచి తరలించలేకపోయారు. కేసు వివరాలు వెల్లడించే అధికారం లేని ఓ ఫెడరల్‌ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. ముఠా సభ్యులు పట్టణంలోని రహదారులపై వాహనాలను తగలబెట్టి కనీసం పది చోట్ల అడ్డంకులు సృష్టించారని చెప్పారు. ''అతడిని అక్కడి నుంచి బయటకు తీసుకురావడం అసాధారణమైన పని'' అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.గ్వాసావేకు చెందిన అగ్నిమాపక సిబ్బంది పావోలా సాంచెజ్‌ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి వేలాది మంది కాల్పుల నుంచి తప్పించుకునేందుకు కిరాణా దుకాణాలు, ఇతర భవనాల్లో తలదాచుకున్నారని చెప్పారు. ''చాలా దుకాణాలు, కార్లు, ట్రక్కులకు నిప్పంటించారు'' అని ఆమె తెలిపారు.కాల్పుల తీవ్రత కారణంగా అగ్నిమాపక సిబ్బంది తమ కేంద్రంలోనే తలదాచుకున్నారు. శనివారం ఉదయం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే మంటలు ఇంకా కొనసాగుతున్నాయా అని పరిశీలించేందుకు సిబ్బంది బయటకు వెళ్లారు. శనివారం పరిస్థితి కొంత శాంతించినా భయం మాత్రం తొలగలేదు. సినాలోవాలో పౌరుల రక్షణ కోసం భద్రతా బలగాలు కొనసాగుతాయని మెక్సికో భద్రతా మంత్రి ఒమర్‌ గార్సియా హర్ఫుచ్‌ ఎక్స్‌లో తెలిపారు. ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన నలుగురు సైనికుల మృతిపై విచారం వ్యక్తం చేశారు.పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారిపై కాలిపోయిన ట్రక్కులు ఇంకా కనిపించాయి. పలు రహదారులు మూసుకుపోయాయి. ''నిన్నటి పోరాటం ఆనవాళ్లు ఇంకా కనిపిస్తున్నాయి. వీధుల్లో కాలిపోయిన కార్లు, పూర్తిగా దగ్ధమైన పలు ఆక్సో దుకాణాలు ఉన్నాయి'' అని అల్మా కమాచో తెలిపారు. వీధుల్లో భద్రతా బలగాలు కనిపించకపోవడంతో ప్రజలు ఇంకా భయంతో ఉన్నారని చెప్పారు.కార్టెల్‌ నేతల అరెస్టులతో హింస పెరిగే ప్రమాదం...మెజా ఫ్లోరెస్‌ అరెస్ట్‌ను అమెరికా, మెక్సికో ప్రభుత్వాలు భద్రతాపరమైన విజయంగా అభివర్ణించాయి. అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఈఏ) మెక్సికో అధికారులను అభినందించింది. ''ఇలాంటి ఫలితాలు ఒక్కరోజులో రావు. నిరంతర సహకారం, పరస్పర నమ్మకంతోనే సాధ్యమవుతాయి. కలిసి పనిచేస్తే భాగస్వాములు ఇలాంటి ఫలితాలు సాధించగలరు'' అని అమెరికా రాయబారి రొనాల్డ్‌ జాన్సన్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ''మా వేట కొనసాగుతుంది'' అని స్పష్టం చేశారు.మెజా ఫ్లోరెస్‌ అరెస్ట్‌ సినాలోవాలో శాంతి నెలకొల్పేందుకు కీలక ముందడుగు అని మెక్సికో భద్రతా మంత్రి గార్సియా హర్ఫుచ్‌ అన్నారు. మరోవైపు కార్టెల్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్‌ మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. గత అధ్యక్షులతో పోలిస్తే షీన్‌బామ్‌ అక్రమ ముఠాలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆమె రెండేళ్ల పాలనలో హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది.జాలిస్కో న్యూ జనరేషన్‌ కార్టెల్‌ నేత నెమెసియో ఒసెగురా సెర్వాంటెస్‌ అలియాస్‌ 'ఎల్‌ మెంచో' సహా పలువురు కీలక ముఠా నేతలపై షీన్‌బామ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైన్యం జరిపిన ఆపరేషన్‌లో ఎల్‌ మెంచో హతమయ్యాడు.అయితే కార్టెల్‌ నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే వ్యూహం దీర్ఘకాలంలో మరింత హింసకు దారితీయవచ్చని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెక్సికో భద్రతా విశ్లేషకుడు డేవిడ్‌ సౌసెడో మాట్లాడుతూ.. అమెరికా ఒత్తిడి కారణంగానే ఇలాంటి అరెస్టులు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ''కార్టెల్‌ అగ్రనేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. కానీ మొత్తం నేర వ్యవస్థను కూల్చడం లేదు. మొదటి, రెండో స్థాయి నేతలను పట్టుకున్నా.. హంతకులు, వీధి స్థాయి డ్రగ్స్‌ విక్రేతలు, వ్యాపార సంస్థలు, రాజకీయ నాయకులు, పోలీసులతో ఉన్న సంబంధాలు అలాగే ఉంటున్నాయి'' అని ఆయన వివరించారు.కార్టెల్‌ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకునే వ్యూహం వల్ల ఆయా ముఠాల్లో నాయకత్వ పోరు మొదలై హింస పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సినాలోవాలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా అరెస్టు తర్వాత మరోసారి హింస చెలరేగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu