పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు.
ఈ నిర్ణయం అనేక రంగాల పై వ్యతిరేక ప్రభావం చూపుతుందని, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు.
అనాలోచిత కారణాల వల్లనే...
మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైందన్నారు రేవంత్ రెడ్డి. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయిందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని, రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందని, ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందని అన్నారు.

