Andhra Pradesh : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించినా ఇంకా రాజకీయంగా జీవించి ఉన్నారు. ఆయన ను సొంతం చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి.
ముద్రగడ పద్మనాభం నామం జపించ లేకుండా అన్ని పార్టీల కాపు నేతలు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం మృతి చెందిన తర్వాత ఆయనపై కాపు సామాజికవర్గంలో సానుభూతి పెరగడమే అందుకు కారణం. ముద్రగడ పద్మనాభం మరణించే ముందు వైసీపీలోనే ఉన్నారు. దీంతో ఆయన మావాడే అంటోంది ఫ్యాన్ పార్టీ. కానీ ముద్రగడ పద్మనాభం అందరి వాడు అంటోంది టీడీపీ. ఆయన బాటలోనే నడుస్తామని టీడీపీ కాపు సామాజికవర్గం నేతలు అంటున్నారు.
కాపుల్లో ముద్ర గడ...
ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పార్టీలు మారవచ్చు. ఆయన అనుకున్న ప్రకారమే నడవవచ్చు. కానీ కాపు సామాజికవర్గం కోసం అనేక సార్లు పదవులను సయితం తృణ ప్రాయంగా వదులుకున్నారన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి తర్వాత ప్రతి జిల్లాలో సంతాప సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎవరికి వారే ముద్రగడ కాపుల ప్రయోజనం కోసం చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయనను తమ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ముద్రగడ సంస్మరణతో కాపు సామాజికవర్గాన్ని మంచి చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ముద్రగడ కాపులకు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.
పార్టీలకు అతీతంగా...
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముద్రగడకు వీరాభిమానులున్నారు. ఆ మాటకొస్తే వంగవీటి రాధా తర్వాత అంతగా కాపులను ప్రభావితం చేసిన నేత ముద్రగడ పద్మనాభం మాత్రమే. అందుకే ఆయన మా వాడే అంటూ చెప్పుకుని వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన తర్వాత ఆయనకు పార్టీలకు అతీతంగా కిర్లంపూడికి వచ్చి నివాళులర్పించారు. అంతే కాదు. తర్వాత కూడా ఆయన సేవలను జనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో టీడీపీ, వైసీపీలు ప్రధానంగా పోటీ పడుతుండటంతో ముద్రగడ మృతి చెందిన తర్వాత ఆయన మరింతగా జనానికి చేరువయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.మరి ముద్రగడ సానుభూతి పరుల ఓట్లు ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

