Andhra Pradesh : స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో నారా లోకేశ్ మరింత బలోపేతం అయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ అంతా తానే అయి వెనకుండి నడిపించి..
పార్టీలో 90 శాతానికి పైగా సక్సెస్ రేటు సాధించడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ నేతలను అడ్డుకోవడంలో సక్సెస్ కావడంతో పాటు, తమ పార్టీకి చెందిన వారిని మున్సిపల్, పరిషత్, పల్లె పోరులో గద్దెనెక్కించి లోకేశ్ పార్టీ క్యాడర్ లో హీరో అయ్యారనే చెప్పాలి. ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అనుసరించిన వ్యూహాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు సయితం భావిస్తున్నారు. టిట్ ఫర్ టాట్ అనే నినాదంతో లోకేశ్ పనిచేయడం వల్లనే ఈ విజయం సాధ్యమయిందని పార్టీ నేతలు, కార్యకర్తలు నమ్ముతున్నారు.
సాఫ్ట్ కార్నర్ తనకు లేదంటూ...చంద్రబాబు వంటి సాఫ్ట్ కార్నర్ తనకు లేదని లోకేశ్ ఇటు పార్టీకి, అటు ప్రత్యర్థులకు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా బలంగా చాటి చెప్పగలిగారంటున్నారు. పట్టణ మరియు గ్రామీణ స్థానిక సంస్థల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఘనవిజయం సాధించడంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లోనూ కూటమి ఆధిక్యం కనబరిచింది. దీని వెనక లోకేశ్ వ్యూహాలు ఉండటం వల్లనే ఇంతటి ఘన విజయం సాధ్యమవుతుందని క్యాడర్ కూడా నమ్ముతుంది. ఇన్నాళ్లు చంద్రబాబు కొంత రాజీ ధోరణితో వెళ్లేవారు. వ్యవహరించేవారు. కానీ లోకేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా ఎఫెన్స్ లో వెళుతుండటం క్యాడర్ లో మరింత ఉత్సాహం నింపుతుంది. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా భవిష్యత్ టీడీపీ నేత లోకేశ్ మాత్రమే. అందుకే ఆయన వేసే ప్రతి అడుగు కార్యకర్తల కోసమే అన్న సందేశాన్ని, సంకేతాలను బలంగా పంపగలిగారని కూడా పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అనుకూల ఫలితాలు...పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నవంబరు 3న ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు జరిగిన ఎన్నికల్లో కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి మొత్తం 93 పీఠాలను అందులో 12 మేయర్లు, 81 చైర్మన్లు గెలుచుకోగా, వైసీపీ కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైంది. పరిషత్ ఎన్నికల్లో 659 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి 564 స్థానాలలో టీడీపీ 470, జనసేన 70 కైవసం చేసుకుంది. 2024 సాధారణ ఎన్నికల్లో 55.3 శాతంగా ఉన్న కూటమి ఓట్ల వాటా, 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో 58.90 శాతానికి పెరిగిందని పార్టీ నేతలే చబెుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81 శాతం నుండి 33.56 శాతానికి తగ్గిందని కూడా అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనపై దృష్టి సారించగా, పార్టీ వ్యవహారాలు మరియు ఎన్నికల వ్యూహరచన బాధ్యతను నారా లోకేశ్ ముందుండి నడిపించారు. సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తకుండా లోకేశ్ సమన్వయం చేశారు. 13 కార్పొరేషన్లలో టీడీపీ 10 చోట్ల పోటీ చేసి, జనసేనకు 2, బీజేపీకి 1 స్థానాన్ని కేటాయించింది. జనసేన పోటీ చేసిన స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం ఈ సమన్వయానికి నిదర్శనంగా నిలిచింది.నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాల్లో నేరుగా పాల్గొని, క్షేత్రస్థాయి కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు.

