నాటో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు రెండేళ్ల నుంచి మార్క్ రుట్టె ఎక్కువ సమయం అమెరికాను ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమిలో కొనసాగించడంపైనే దృష్టి పెట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో నుంచి వైదొలుగుతానన్న హెచ్చరికలు చేయకుండా నిలువరించేందుకు ఆయన బహిరంగంగానే ప్రశంసల వర్షం కురిపించారు.అయితే పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దీంతో ఈ వారం టర్కీలో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు ఒత్తిడి మరింత పెరిగింది. మొదట్లో ప్రధాన సమస్య రక్షణ వ్యయం. తమ జాతీయ ఆదాయంలో చాలా తక్కువ భాగాన్ని రక్షణకు కేటాయిస్తున్నారని ట్రంప్ చాలాకాలంగా నాటో సభ్య దేశాలను విమర్శిస్తున్నారు. అయితే గత ఏడాది జరిగిన శిఖరాగ్ర సమావేశంలో అమెరికా మాదిరిగానే స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటాను రక్షణ రంగంలో పెట్టుబడిగా పెట్టేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి.
అసలు సవాల్...ఇప్పుడు నాటో ముందున్న అసలు సవాలు ఆ నిధులను బలమైన సైనిక సామర్థ్యాలుగా మార్చడం. ముఖ్యంగా రష్యా దాడి చేసే అవకాశం ఉందన్న ఆందోళన యూరప్ దేశాల్లో పెరుగుతున్న వేళ ఇది మరింత కీలకంగా మారింది.గత నెల వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన రుట్టె ఆయన సందేహాలను నివృత్తి చేసేందుకు మరో ప్రయత్నం చేశారు. "ది ట్రంప్ ట్రిలియన్" అనే బంగారు అక్షరాలతో ఉన్న చార్ట్‌ను చూపిస్తూ, 2017 నుంచి యూరప్ మిత్రదేశాలు, కెనడా కలిసి 1.2 ట్రిలియన్ డాలర్లు రక్షణ వ్యయంగా పెట్టాయని వివరించారు.అయితే ట్రంప్ మాత్రం పెద్దగా ప్రభావితమైనట్లు కనిపించలేదు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై తాను చేపట్టిన యుద్ధానికి కొంతమంది నాటో దేశాలు మద్దతు ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు."వాళ్ల డబ్బు మాకు అవసరం లేదు. ఏదీ అవసరం లేదు. నాకు కావాల్సింది విధేయత మాత్రమే" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ ఆతిథ్యం ఇస్తుండకపోతే ఈసారి నాటో సమావేశానికే హాజరయ్యేవాడిని కాదని కూడా ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ గౌరవించే కొద్దిమంది విదేశీ నేతల్లో ఎర్డొగాన్, రుట్టె ఉన్నప్పటికీ సమావేశాన్ని సజావుగా నడిపించడం వారికి సవాలుగానే మారింది.వైట్‌హౌస్‌లో రుట్టె కొత్త వ్యూహం...సాంప్రదాయంగా నాటో అత్యున్నత పౌర అధికారి బాధ్యత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం, మొత్తం 32 దేశాల తరఫున మాట్లాడటమే. ఈ పదవి ఎప్పుడూ యూరప్ దేశానికే చెందుతుంది.అయితే ట్రంప్ రెండు దఫాల అధ్యక్ష పదవీకాలంలో రుట్టెతో పాటు ఆయనకు ముందు నాటో ప్రధాన కార్యదర్శిగా ఉన్న జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కూడా అమెరికా కూటమిలోనే కొనసాగేలా చేయడానికే ఎక్కువ శక్తి వెచ్చించాల్సి వచ్చింది.ట్రంప్ నాటో నుంచి వైదొలుగుతానని పలుమార్లు హెచ్చరించారు. యూరప్ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న ఆలోచన కూడా వ్యక్తం చేశారు. నాటో సభ్య దేశమైన డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతం గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకురావాలని కూడా చెప్పారు. తగినంత రక్షణ వ్యయం చేయని సభ్య దేశాలకు అమెరికా రక్షణ కల్పిస్తుందా లేదా అన్న సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. దీంతో సభ్య దేశాల మధ్య విశ్వాసం దెబ్బతింది.రుట్టె మాత్రం ప్రశంసలనే ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. గత నెల ఓవల్ ఆఫీస్‌లో అమెరికా జెండాను గుర్తు చేసే విధంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రదర్శనతో ట్రంప్‌ను మెప్పించేందుకు ప్రయత్నించారు. ట్రంప్‌ను ఒకసారి "డాడీ"తో పోల్చారని అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న రుట్టె, ఈసారి మరింత ముందుకెళ్లారు.ట్రంప్ నాయకత్వం వల్లే అమెరికాలో వేలాది ఉద్యోగాలు వచ్చాయని, యూరప్ దేశాలు 300 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సామగ్రికి ఆర్డర్లు ఇచ్చాయని చార్టుల ద్వారా వివరించారు. "స్వేచ్ఛా ప్రపంచానికి నాయకుడు" అని ట్రంప్‌ను కొనియాడారు.అయితే ఇరాన్ అంశంలో నాటో అమెరికాకు అండగా నిలవలేదన్న ట్రంప్ వ్యాఖ్యలను రుట్టె మృదువుగా ఖండించారు. ఏప్రిల్‌లో కాల్పుల విరమణకు ముందు యూరప్‌లోని స్థావరాల నుంచి ఐదు వేల వరకు అమెరికా విమానాలు బయలుదేరాయని గుర్తు చేశారు.యూరప్‌లో అమెరికా బలగాలపై అనిశ్చితి...అత్యంత శక్తివంతమైన సభ్య దేశమైన అమెరికా లేకుండా నాటో సమర్థంగా పనిచేయడం కష్టం. అదే సమయంలో రష్యా నుంచి ముప్పు పెరుగుతున్న వేళ యూరప్ దేశాలు తమ రక్షణను తామే చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.గత నెల పెంటగాన్ మరో ప్రకటనతో నాటో దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. సభ్య దేశంపై దాడి జరిగితే ఇప్పటివరకు అందించిన స్థాయిలో సైనికులు, యుద్ధ నౌకలు, విమానాలు, డ్రోన్లు ఇవ్వబోమని తెలిపింది. అమెరికా బలగాలను యూరప్‌లో తగ్గిస్తామా, పెంచుతామా అన్న విషయంపై ట్రంప్ కూడా భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ పరిణామాలు నాటో ఐక్యతపై ప్రభావం చూపాయి. ఇదే సమయంలో యూరప్‌లోని పలు దేశాల్లో సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లతో రష్యా నిఘా కార్యకలాపాలు పెంచుతోందని గురువారం విడుదలైన అధ్యయనం వెల్లడించింది.గతసారి ఫలించిన వ్యూహం... నాటో ప్రతి శిఖరాగ్ర సమావేశం పరస్పర భద్రత పట్ల సభ్య దేశాల నిబద్ధతను చాటేందుకు నిర్వహిస్తారు. ఒప్పందంలోని ఆర్టికల్-5 ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే మిగతా దేశాలన్నీ అండగా నిలవాలి. ఈ నిబంధన ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే అమల్లోకి వచ్చింది. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాకు మద్దతుగా సభ్య దేశాలు దాన్ని అమలు చేశాయి.గత నాటో సమావేశం రుట్టె స్వస్థలమైన నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరిగింది. డచ్ రాజ కుటుంబం విందు ఏర్పాటు చేయగా ట్రంప్ రాజభవనంలో బస చేశారు.ఆ సమావేశంలో రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే ప్రతిపాదనకు రుట్టె సభ్య దేశాల మద్దతు కూడగట్టారు. సమావేశం ముగిసే సమయానికి ట్రంప్ నాటో భాగస్వాములను "మంచి వ్యక్తుల బృందం"గా అభివర్ణించారు. ఈసారి సమావేశానికి ఎర్డొగాన్ ఆతిథ్యం ఇస్తున్నారు. నాటోలో కీలక సభ్య దేశంగా ఉన్న టర్కీ తరచూ స్వతంత్ర వైఖరి ప్రదర్శిస్తుంది. ట్రంప్‌తో ఎర్డొగాన్‌కు ఉన్న సాన్నిహిత్యం వల్ల అమెరికా అధ్యక్షుడు సమావేశానికి హాజరయ్యే అవకాశాలు పెరిగినా, కూటమిలో పెరుగుతున్న విభేదాలను అది పూర్తిగా తొలగిస్తుందనే హామీ లేదు.యూరప్ దేశాలు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతున్నందున అమెరికా తన దృష్టిని చైనా నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్లపై కేంద్రీకరించవచ్చని, ఉక్రెయిన్ యుద్ధాన్ని యూరప్ చూసుకుంటుందని రుట్టె ట్రంప్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఇప్పుడు ట్రంప్ కోరేది మరింత ఎక్కువ. ఆయన కోరుతున్న "విధేయత"ను ఏ చార్టులోనూ చూపించడం సాధ్యం కాదు.రుట్టెకు ముందు నాటో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తన ఆత్మకథలో 2018 నాటి శిఖరాగ్ర సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు."అమెరికా అధ్యక్షుడు ఇతర సభ్య దేశాలను రక్షించబోనని చెప్పి నిరసనగా నాటో సమావేశం నుంచి వెళ్లిపోతే, నాటో ఒప్పందం, దాని భద్రతా హామీ విలువ కోల్పోతాయి" అని ఆయన రాశారు.

