Pakistan : పాకిస్థాన్ నైరుతి ప్రాంతంలోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బొగ్గు గనిలో గురువారం జరిగిన భారీ పేలుడులో కనీసం 32 మంది గని కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
మరో 10 మంది గనిలో చిక్కుకుపోయారు. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి.క్వెట్టా నగర శివారులో ఉన్న గనిలో మీథేన్ వాయువు పేరుకుపోవడంతో పేలుడు సంభవించినట్లు ప్రభుత్వ గనుల తనిఖీ అధికారి ఘనీ బలోచ్ తెలిపారు.పేలుడు జరిగిన కొన్ని గంటల్లోనే ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మరో 25 మృతదేహాలు లభించాయి. ఇంకా గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రావిన్స్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.చిక్కుకున్న వారందరినీ బయటకు తీసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఘనీ బలోచ్ చెప్పారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ప్రాణాలతో బయటపడే..."మీథేన్ వాయువు పేలుళ్ల తర్వాత ఆక్సిజన్ స్థాయి దాదాపు సున్నాకు చేరుతుంది. అందువల్ల ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. రక్షణ సిబ్బంది కూడా అత్యంత జాగ్రత్తగా గనిలోకి వెళ్తున్నారు" అని ఆయన చెప్పారు.మృతదేహాలను అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గనిలో చిక్కుకున్న వారి బంధువులు ఆందోళనతో సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.బలూచిస్తాన్ గనులు, ఖనిజాల శాఖ మంత్రి షోయబ్ నోషెర్వానీ మాట్లాడుతూ, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పేలుడులో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ఐదు లక్షల పాకిస్థాన్ రూపాయల (సుమారు 1,800 అమెరికా డాలర్లు) పరిహారం అందజేస్తామని ప్రకటించారు.పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపడతామని, గనుల్లో అమలవుతున్న భద్రతా చర్యలను సమీక్షిస్తామని మంత్రి తెలిపారు.నిర్లక్ష్యమే కారణమని...ఈ ఘటనలో నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని బొగ్గు గని కార్మికుల సంఘం ఆరోపించింది. గని భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, వాటిని ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ సెంట్రల్ మైన్స్ లేబర్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది.పాకిస్థాన్‌లో, ముఖ్యంగా బలూచిస్తాన్‌లో బొగ్గు గనుల్లో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. చాలా గనుల్లో సరైన గాలి ప్రసరణ, వాయువు పర్యవేక్షణ వ్యవస్థలు, ఇతర మౌలిక భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.గని యజమానులు భద్రతా నిబంధనలు పాటించడం లేదని, కార్మికులకు తగిన రక్షణ పరికరాలు అందించడం లేదని కార్మిక సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ప్రమాదాలు, తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోసం ఈ బొగ్గు గనులపైనే ఆధారపడుతున్నారు. పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో నిరుద్యోగం, పేదరికం ఇప్పటికీ విస్తృతంగా ఉన్నాయి.

