Andhar Pradesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నిర్ణయాలు నాన్చడం అంత సులువు కాదు. ఆయనకు రానున్న కాలంలో చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు.
ఏ నిర్ణయం తీసుకోవాలా? అన్న ఊగిసలాటలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు కనపడుతుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అత్యధిక స్థానాలను కేటాయించాలని జనసైనికుల ఒత్తిడి ఒకవైపు, మరొకవైపు కూటమిని బలంగా ఉంచడం. ఈ రెండు ఒక ట్రాక్ లో నడిచేవి కావు. రెండూ వేర్వేరు పట్టాలు. సాఫీగా ఇప్పటి వరకూ బండి నడిచింది. అయితే రానున్న కాలంలో నిర్ణయం ఎటువైపు తీసుకున్నా పవన్ కల్యాణ్ కు రాజకీయంగా నష్టం తప్పదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న మేరకు సీట్లు సాధించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నప్పటికీ తమకు ఆశించిన స్థానాలు దక్కలేదని, అనేక చోట్ల టీడీపీ రెబల్స్ అభ్యర్థులను బరిలోకి దింపి తమను ఓడించినా పవన్ మాట్లాడకపోవడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
కూటమి ధర్మం పాటిస్తూనే...రానున్న కాలంలో పవన్ కల్యాణ్ వ్యూహం స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది. ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, మరోవైపు తన పార్టీ మూలాలను బలోపేతం చేసుకుందామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు నిజమే కావచ్చు. కానీ రెండింటినీ ఒక గాటన కట్టేసి చూడలేమంటున్నారు. కూటమి సజావుగా సాగాలంటే జనసేనకు అన్ని వర్గాల నుంచి తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కేలా ఆయన చర్యలు తీసుకోవాలి. అంటే కూటమిలో భాగస్వామ్య పార్టీల పై ఒత్తిడి పెంచి గౌరవప్రదమైన అంకె కలిగిన స్థానాలను సాధించగలిగాలి. అప్పుడే జనసైనికులు పవన్ ను నాయకుడిగా మరింతగా గుర్తిస్తారు. అంతే తప్ప తమతో తగ్గేదేలేదని చెప్పి చివరకు ఏ మాత్రం కూటమిలో పార్టీల ఒత్తిడికి తలొగ్గితే కొంత పవన్ అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి ఉంటుంది. రగతంలో రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాను సీట్ల సర్దుబాటు విషయంలో రాజీ పడ్డానని, అయితే కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటే చూస్తూ ఊరుకోనని ఆయన స్పష్టం చేశారు. కానీ వాస్తవంలో అది కార్యరూపం దాల్చలేదని జనసేన నేతలు అంటున్నారు. జనసైనికుల ఒత్తిడి నుంచి...జనసైనికుల ఒత్తిడి ఈ సారి మాత్రం ఒకింత ఎక్కువగానే ఉంది. పంచాయతీ శాఖ పవన్ నేతృత్వంలోనే ఉండటంతో ఎక్కువ పంచాయతీలను తాము సొంతం చేసుకుంటే క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతామని చెబుతున్నా నాయకత్వం పట్టించుకోలేదని పార్టీ నేతలు మదనపడుతున్నారు. పదవుల విషయంలో ఇక జనసైనికులు ఓపిక పట్టే అవకాశాలు ఎంత మాత్రం లేదు. నిన్న మొన్నటి వరకూ పవన్ కోసమే పనిచేసిన జనసైనికులు ఇకపై తమ కోసం కష్టపడాలని సహజంగానే భావిస్తారు. ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు దాటుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల సెగ పవన్ కల్యాణ్ ను గట్టిగానే తాకనుంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు మెజారిటీ స్థానాలు దక్కాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. టీడీపీతో పోలిస్తే క్షేత్రస్థాయిలో తమకు దక్కాల్సిన సీట్లు, ప్రాధాన్యత విషయంలో తక్కువ కాకుండా ఉండాలని నాయకులు అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. పవన్ కు ఇది కీలక సమయంగానే భావించాలి.

