చమురు కంపెనీలు జనానికి మరోసారి షాకిచ్చాయి. పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఐదు రోజుల క్రితం పెంచిన చమురు సంస్థలు మరోసారి ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచింది.
లీటరు పెట్రోలు ధరపై 86 పైసలు, డీజిల్ ధరపై 83 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఈరోజు తాజాగా మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యుడి ధరల శరాఘాతం తగలనుంది.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం...పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం కారణంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరలు పెరిగాయి. దీంతో మరోసారి ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. చమురు సంస్థలు ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ చమురు సంస్థలు మరోసారి అడ్డదిడ్డంగా జనం మీద బాదుడు కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. నాలుగు రోజుల క్రితం పెరిగిన ధరల నుంచి తేరుకోక ముందే సామాన్యుడిపై మరోసారి భారం మోపడంతో ధరలు ఇంకెంత పెరుగుతాయన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతుంది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో...హోర్ముజ్ జలసంధి నుంచి చమురు నౌకలు రాకపోవడంతో పాటు క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా ఇంథన సంక్షోభానికి కారణమని చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమయింది. అప్పటి నుంచి హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే నాలుగేళ్ల నుంచి తాము పెట్రోలు, డీజిల్ ధరలను పెంచలేదంటూ చమురు సంస్థలు ప్రజలను నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ పెరిగిన ధరలతో నిత్యావసర వస్తువుల ధరలన్నీ మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.

