Dailyhunt
Revanth Reddy : ఢిల్లీలో రేవంత్.. కేంద్రమంత్రులతో వరస భేటీలు

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్.. కేంద్రమంత్రులతో వరస భేటీలు

TeluguPost.com 1 week ago

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్‌-II సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II, మెట్రో ఫేజ్‌-IIIపై కేంద్ర మంత్రితో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు.

దశల వారీగా విస్తరణకు...

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్‌-III విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్‌-Iను L&TMRHLను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం వివరించారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్‌-II, ఫేజ్‌-III విస్తరణ సులువవుతుందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-IIలో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కి.మీ మేర విస్తరణకు, రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II ప్రాజెక్ట్ ను భారత ప్రభుత్వం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

భవిష్యత్ అవసరాల కోసం...

హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ - భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్-IIIగా చేపట్టాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-III కిసంబంధించిన డీపీఆర్ ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్‌, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu