Dailyhunt
Summer Effect : సుర్రుమంటున్న ఎండలు.. పంటలను కాజేస్తున్నవానలు

Summer Effect : సుర్రుమంటున్న ఎండలు.. పంటలను కాజేస్తున్నవానలు

TeluguPost.com 3 weeks ago

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు విభిన్న పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని, అలాగే వానలు కూడా పడతాయని చెప్పింది.

ఈరోజు, రేపు పిడుగులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. అలాగే కొన్నిజిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో...

దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలపై మరోక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో ఈరోజు, రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ జిల్లాల్లో వానలు.. ఎండలు...

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.నేడు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో 42 డిగ్రీలు, తిరుపతి రేణిగుంటలో 42.3 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 41.8 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్టలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

సుర్రుమంటున్న ఎండలు...

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. ఉక్కపోత అధికంగా ఉంది. సెగగాలుల తీవ్రతకూడా అధికంగా ఉంది. కొన్నిజిల్లాల్లో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు నష్టపోతున్నారు. దక్షిణ తెలంగాణలో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా, ఉత్తర తెలంగాణలో అకాల వానలు రైతులను ముంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తమ పంట ఉత్పత్తులను జాగ్రత్త చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోనూ నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండలు, వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu