Halifax : చైనాతో వాణిజ్య సంబంధాలను మరింత పెంచుకుంటే కెనడా ఆర్థిక ఒత్తిళ్లకు గురయ్యే ప్రమాదం ఉందని తైవాన్ ఉప విదేశాంగ మంత్రి చెన్ మింగ్చి హెచ్చరించారు.
చైనాపై ఆధారపడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తైవాన్ స్వయంగా అనుభవించిందని చెప్పారు. ప్రధాని మార్క్ కార్నీ చైనాతో సంబంధాలను మెరుగుపరుచు కునే ప్రయత్నాలు కెనడాను కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.హాలిఫాక్స్ అంతర్జాతీయ భద్రతా సదస్సులో అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాల మెరుగుదలపై ప్రశ్నించగా.. ''మాకు ఆందోళనగా ఉంది. నిజంగానే ఆందోళనగా ఉంది'' అని అన్నారు.అమెరికా సుంకాలు, కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలను ప్రస్తావిస్తూ.. అగ్రరాజ్యాలు ఆర్థిక సంబంధాలను ఆయుధాలుగా వాడుకుంటున్నాయని కార్నీ గతంలో హెచ్చరించారు. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవాలంటే మధ్యస్థాయి శక్తులుగా ఉన్న దేశాలు వాణిజ్య భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని సూచించారు.స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదికపై కార్నీ చేసిన ప్రసంగాన్ని చెన్ ప్రశంసించారు. అయితే ప్రజాస్వామ్య విలువలను పంచుకోని దేశాలతో కెనడా సంబంధాలను మరింత పెంచుకోవాలా? అని ప్రశ్నించారు. ''మీరు ఎలాంటి దేశాలను భాగస్వాములుగా ఎంచుకోవాలనుకుంటున్నారు?'' అని అన్నారు.చైనాతో కెనడాకు గతంలో ఎదురైన అనుభవాలను కూడా గుర్తుచేశారు. ''మీకు మీ సొంత చరిత్ర ఉంది. ఇద్దరు మైఖేల్స్ ఉన్నారు'' అని వ్యాఖ్యానించారు. మాజీ కెనడా దౌత్యవేత్త మైఖేల్ కోవ్రిగ్, వ్యాపారవేత్త మైఖేల్ స్పావర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 2018లో కెనడా.. అమెరికా అప్పగింత అభ్యర్థన మేరకు హువావే సంస్థ ఉన్నతాధికారి మెంగ్ వాన్‌జౌను అదుపులోకి తీసుకున్న కొద్దికాలానికే చైనా ఈ ఇద్దరినీ అరెస్టు చేసింది. దాదాపు మూడేళ్ల పాటు నిర్బంధంలో ఉంచింది. 2021 సెప్టెంబరులో మెంగ్ చైనాకు తిరిగివెళ్లిన రోజే వారిద్దరూ విడుదలయ్యారు. అయితే తమ చర్యలకు రాజకీయ ఉద్దేశాలు లేవని బీజింగ్ అప్పట్లో ఖండించింది.
చైనా వాహనాలతో నిఘా ముప్పు...ఇటీవల షెన్జెన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమైన కార్నీ.. వాణిజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నాల్లో భాగంగా సుంకాలను మరింత తగ్గించేందుకు అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో కెనడా ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టింది.వాషింగ్టన్‌తో చర్చలు విఫలమైతే చైనా కార్ల తయారీ సంస్థల వైపు వెళ్లే అవకాశముందని కార్నీ చెప్పారు. జనవరి 1 నుంచి కెనడా వాహనాలు, విడిభాగాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.అయితే చైనా విద్యుత్ వాహనాలు కెనడా వాహన తయారీ సంస్థలకు ముప్పుగా మారవచ్చని చెన్ హెచ్చరించారు. ఆ వాహనాలను కెనడాలోనే తయారు చేసినా.. వాటిలోని అనుసంధాన సాంకేతికత ద్వారా నిఘా ప్రమాదాలు తలెత్తవచ్చని అన్నారు.చైనాతో కెనడా వాణిజ్య సంబంధాలు అమెరికా సంబంధాల కంటే భిన్నమైనవని కార్నీ వాదిస్తున్నారు. కెనడా ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనం, ఇతర ముడి సరుకులను ఎగుమతి చేస్తోంది. అధునాతన సెమీకండక్టర్ల వంటి కీలక సాంకేతిక ఉత్పత్తులపై ఆధారపడటం లేదని చెబుతున్నారు.చైనాపై ఆధారపడటాన్ని తగ్గించిన తైవాన్...వాణిజ్య ఆంక్షలతో రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు చైనా ప్రయత్నించిందని, ఆ అనుభవాల తర్వాత తైవాన్ ఆ దేశంపై ఆర్థిక ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకుందని చెన్ తెలిపారు.''దేశాల మధ్య పరస్పర ఆధారపడటాన్ని ఆయుధంగా మార్చడంలో చైనా చాలా నేర్పరి. మన ఆధారపడటాన్ని ఉపయోగించుకుని రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడంలోనూ ముందుంటుంది'' అని వ్యాఖ్యానించారు.2010లో చైనాకు వెళ్లిన తైవాన్ పెట్టుబడుల వాటా 80 శాతానికి పైగా ఉండేదని, గతేడాది అది 3.8 శాతానికి తగ్గిందని చెప్పారు. అలాగే చైనా, హాంకాంగ్‌లకు తైవాన్ ఎగుమతుల వాటా 2020లో మొత్తం ఎగుమతుల్లో దాదాపు 44 శాతం ఉండగా.. గతేడాది 27 శాతానికి పడిపోయిందని తైవాన్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఇటీవల షెన్జెన్ శిఖరాగ్ర సమావేశంలో షీ జిన్‌పింగ్.. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్యలో కూర్చున్న ఫొటోను చైనా ప్రచారానికి వాడుకుంటోందని చెన్ ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా షీని చూపించేందుకు ఈ ఫొటోను ఉపయోగిస్తున్నారని అన్నారు. ''దేశ ప్రజలకు మాత్రమే కాదు.. ప్రపంచానికి కూడా తానే నాయకుడినని నిరూపించుకోవాలన్నదే దీని వెనుక ప్రధాన ఉద్దేశం. ప్రచారం చేయడంలో వారు చాలా నేర్పరులు'' అని వ్యాఖ్యానించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యం కంటే ప్రతీకాత్మకతే ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.తైవాన్ చుట్టూ చైనా సైనిక కార్యకలాపాలను మరింత పెంచుతోందని చెన్ చెప్పారు. దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసినా చైనా వెనక్కి తగ్గడం లేదన్నారు. తైవాన్ చుట్టూ సముద్ర దిగ్బంధనం విధించేందుకు చైనా నౌకాదళం సన్నాహాలు చేస్తుండవచ్చని హెచ్చరించారు.అయితే కార్నీ అంతర్జాతీయ నాయకత్వాన్ని చెన్ ప్రశంసించారు. తైవాన్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య సహకార ఒప్పందంపై సంతకం చేసేందుకు ఆయన చూపుతున్న ఆసక్తిని స్వాగతించారు. ''ప్రధాని కార్నీ దార్శనికతపై మాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఆలోచనల్లో మేమూ భాగస్వాములం కావాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

