తెలుగుదేశం పార్టీ విశాఖ నేతల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తమకు కేబినెట్ పదవులు లభించకపోవడంపై సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.
ప్రధానంగా గంటా శ్రీనివాసరావు మంత్రి పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తనను కాదని ఒక జూనియర్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. తాను పార్టీకి ఎన్నో రకాలుగా సహకారం అందించినప్పటికీ, తనను పక్కన పెట్టడంపై గంటా శ్రీనివాసరావు అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది తనకు అవమానమని ఆయన భావిస్తున్నారు. తన పదవికి, మంత్రి నారాయణ పదవికి ముడిపెడితే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
దక్కకపోవడానికి...గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆయన వియ్యంకుడు మంత్రి నారాయణ ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. మరొకవైపు కాపు సామాజికవర్గం నేతలకు అధికంగా చంద్రబాబు కేబినెట్ లో చోటు కల్పించారు. విశాఖ జిల్లాలో అయ్యన్న పాత్రుడికి శాసనసభ స్పీకర్ పదవి దక్కింది. మరొక సీనియర్ నేత బండారు సత్యనారాయణకు కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు. ఆయన అల్లుడు కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయనకు లభించలేదు. ఇంకా సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. మరొకవైపు పల్లా శ్రీనివాసరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. రాజకీయ విశ్రాంతి...ఇటువంటి సమయంలో గంటా శ్రీనివాసరావు పేరును నాయకత్వం పక్కన పెట్టింది. కానీ ఆయన టీడీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించినప్పటికీ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలోనూ స్థానం దక్కింది. కానీ ఈసారి మాత్రం వివిధ రాజకీయ సమీకరణాలు, సామాజిక సమతుల్యత కారణంగానే మంత్రి పదవి లభించలేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు టీడీపీలో మంత్రి పదవి దక్కదని భావించిన గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికలకు తన వారసుడిని పోటీకి దింపాలని, తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.

