ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు చేస్తున్న రాజకీయం టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న ప్రకటనలు, యూట్యూబ్ ఛానళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
ఉప శాసనసభ పతిగా అన్ని మతాల వారినీ గౌరవించాల్సిన సమయంలో ఒక మతంపై ఆయన చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ విషయాలు వెళ్లినట్లు తెలిసింది. అయితే రఘురామ కృష్ణంరాజు ను కంట్రోల్ చేయడం ఎలా అన్న దానిపైనే చంద్రబాబు ఆలోచిస్తున్నారని పార్టీ ముఖ్య నేతలు కూడా చెబుతున్నారు.
మతం ఆధారంగా రాజకీయం...ఆంధ్రప్రదేశ్ లో మతం ఆధారంగా రాజకీయం నడవటం లేదు. కేవలం సామాజికవర్గాల పరంగానే ఎన్నికల్లో ఓట్లు వేసే సంస్కృతి ఉంది. టీడీపీలో అన్ని మతాలకు చెందిన వారున్నారు. కేబినెట్ లోనూ, టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీల్లోనూ అన్ని మతాల వారికీ చంద్రబాబు అవకాశం కల్పించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ మహాసేన రాజేష్ వంటి టీడీపీ నేతలు కూడా రఘురామ కృష్ణంరాజు పై విమర్శలు చేస్తున్నారు. అన్ని మతాల వారినీ గౌరవించాలని, అదే టీడీపీ సంస్కృతి అని, దానికి విరుద్ధంగా రఘురామ కృష్ణంరాజు వ్యవహరించడంపై ఇప్పటికే కొందరు నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. వ్యతిరేక వ్యాఖ్యలతో...రఘురామ కృష్ణంరాజు తన నియోజకవర్గంలో రామాలయం నిర్మాణం విషయంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆయన తర్వాత చేసిన వ్యాఖ్యలపైనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఒక వర్గం ఓటు బ్యాంకు ను రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతల్లోనే అదే చర్చ జరుగుతుంది. కానీ చంద్రబాబు, లోకేశ్ వంటి వారు మాత్రమే రఘురామ కృష్ణంరాజుకు నచ్చ చెప్పగలరన్న భావనలో ఉన్నారు. మరింతగా ఆయన ఒక మతాన్ని టార్గెట్ చేయకుండా ఉంటే పార్టీకి లాభమని, లేకుంటే రానున్న ఏ ఎన్నికల్లోనైనా నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి రాజుగారు తన పంథాను మార్చుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

