తెలంగాణలో ఈనెల 22న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సదస్సులు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అన్ని జిల్లాల్లో ఈనెల 22న జిల్లాస్థాయి సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం గత మార్చి 6వ తేదీ నుండి జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.
జిల్లా స్థాయి సదస్సుల్లో...
అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సదస్సుల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మంత్రులు, ఎం.పి.లు, ఎం.ఎల్.సిలు, ఎం.ఎల్.ఎ.లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా తగు చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సదస్సులలో ముఖ్యమంత్రి సందేశం, 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ప్రజాప్రతినిధుల సందేశాలు, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన వారి వివరాలు వెల్లడించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో సూచించారు.

