తెలంగాణలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈరోజు నుంచి జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి నేడు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా తొలి పుష్కర స్నానం ఆచరించి ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రత్యేకతలు ఇవే...
గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని అయిన సరస్వతి నదుల సంగమమైన ఈ పవిత్ర ప్రదేశంలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని నదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుష్కరాల సమయంలో సుబ్రహ్మణ్య షడక్షరి హోమం, హయగ్రీవ హోమం, నవగ్రహ హోమం, మహా మృత్యుంజయ హోమం వంటి వివిధ విశేష పూజలు నిర్వహించనున్నారు.పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

