తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో ఒక్కసారిగా రద్దీ మరింత పెరిగింది. వేసవి సెలవులు, శుభకార్యాలు జోరుగా జరుగుతుండటంతో పాటు తిరిగి విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని భావించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు.
దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. తిరుమల లోని అన్ని వీధులు గోవింద నామ స్మరణలతో మారు మోగిపోతున్నాయి. తిరుమలకు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అన్ని రవాణా మార్గాల ద్వారా చేరుకుంటున్నారు.
నిత్యం ఎనభై వేల మందికి..తిరుమలకు ప్రతి రోజు ఎనభై వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ఒక్కోసారి మరింత ఎక్కువ మంది వచ్చినా సత్వరం సామాన్య భక్తులకు దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడకుండా మాడ వీధుల్లోనూ, తిరుమల ఆలయం పరిసర ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేసిన అధికారులు భక్తులకు నిరంతరం చల్లటి నీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు నిరంతరం తమ సేవలను అందిస్తున్నారు. శిలాతోరణం వరకూ...ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి దర్శనం కోసం బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడువందల ప్రత్యేక దర్శనం టోకెన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయ పడుతుంది. నిన్న శ్రీవారిని 67,722 భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు 36,705 మంది భక్తులు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

