Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు నిండిపోయి ఉన్నాయి.
భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అలిపిరి టోల్ గేట్ నుంచి నేడు భక్తుల రద్దీ కనపడుతుంది. వాహనాల తనిఖీ సమయం కూడా ఎక్కువ తీసుకుంటుండటం, లగేజీ చెకింగ్ ఆలస్యం కావడంతో భక్తులు తిరుమలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే శుక్రవారం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని అంచనా వేసి అందుకు తగిన చర్యలు తీసుకున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నిత్యం భక్తులతో రద్దీగానే...తిరుమల నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. అయితే వీకెండ్ లో మరింత రద్దీ ఎక్కువవుతుంది. సెలవులు వస్తే చాలు, పండగలు అయితే చాలు వెంటనే తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు ఉత్తర భారత దేశం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి. అలాగే సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. బయట కృష్ణతేజ అతిధి గృహం వరకూ...ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ అతిధి గృహం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూలైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,063 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,565 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.81 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల లడ్డూ విక్రయాలు 4.27 లక్షలు జరిగాయి. నిన్న అన్నప్రసాదాన్ని 2.53 లక్షల మంది భక్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

