Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు నిత్యం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
గత కొన్ని రోజులు నుంచి ఇదే పరిస్థితి ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి ఉంటున్నాయి. మాడ వీధులే కాదు... తిరుమలలోని అన్ని వీధులూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వానలు పడుతున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడికి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఎస్.ఎస్.డి. టోకెన్లు ఇచ్చే...
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి నుండి పదకొండు గంటల మధ్య ఎస్.ఎస్.డి టోకెన్లు ఇస్తున్నారు. తిరుపతిలో టోకెన్లు శ్రీనివాసం - ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా, భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గం వద్ద దివ్య దర్శనం టిక్కెట్లు ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతి రోజు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇస్తారు, అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. వారికి శ్రీవారి దర్శనం సులువుగా లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
పదిహేను గంటలు...
ఈరోజు తిరుమలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,561మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,361 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిన్న 3.85 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. నిన్న 2.06 లక్షల మంది భక్తులు శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

