Antalya : ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో టర్కీలో జరుగుతున్న వాతావరణ సదస్సు (కాప్31)లో చర్చలు రెండో రోజూ గడువు దాటి కొనసాగుతున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై దేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో చర్చలకు ఆతిథ్యమిస్తున్న టర్కీ అధికారులు చివరి నిమిషంలో కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీనిపై అన్ని దేశాల అంగీకారం సాధించి, సదస్సును ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.రెండు వారాల పాటు సాగిన ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న టర్కీ పర్యావరణ మంత్రి మురాత్ కురుమ్ ఆదివారం తెల్లవారుజామున కీలక ప్రకటన చేశారు. ''అన్ని దేశాలు అంగీకరించగలిగే ప్రతిపాదన నా దగ్గర ఉంది'' అని చెప్పారు. అయితే ఆ ప్రతిపాదనలోని పూర్తి వివరాలను వెంటనే వెల్లడించలేదు. రాత్రికి రాత్రే చర్చల్లో పాల్గొంటున్న దేశాలకు ఆ పత్రం అందిందా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. అందులో మార్పులు, అభ్యంతరాలు చెప్పడానికి దేశాలకు కొన్ని గంటల సమయమే మిగిలే అవకాశం ఉంది.బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేందుకు దేశాలు ఉమ్మడిగా ఎంతవరకు కృషి చేయాలన్నది ప్రధాన వివాదంగా మారింది. కాలుష్య కార్బన్‌ను పట్టి నిల్వ చేసే సాంకేతికతను ప్రోత్సహించాలా? విద్యుత్ ఉత్పత్తిని పెంచేటప్పుడు సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాలకే పరిమితం కావాలా? లేక బొగ్గు, సహజవాయువు వంటి ఇతర వనరులనూ వినియోగించాలా? అనే అంశాలపైనా ఏకాభిప్రాయం కుదరలేదు.''ఈ సమావేశ మందిరం బయట వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు మన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు'' అని కురుమ్ చర్చల్లో పాల్గొన్న దేశాల ప్రతినిధులతో అన్నారు.శుక్రవారంతో చర్చలు ముగియాల్సి ఉండగా.. శనివారం సదస్సు ప్రాంగణంలోని ఏర్పాట్లను సిబ్బంది సర్దేశారు. అయితే వాతావరణ సదస్సుల్లో నిర్ణీత గడువు దాటి చర్చలు కొనసాగడం సాధారణమే.
శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకపోవడంపై విమర్శలు...
ఈ ఏడాది సదస్సులో రూపొందించిన తుది ఒప్పంద ముసాయిదాలో శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణమైన బొగ్గు, చమురు, సహజవాయువు వినియోగాన్ని తగ్గించడంపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. వాతావరణ మార్పుల వల్ల వేడిగాలులు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారింది.భూతాపం వల్ల అత్యంత ప్రమాదకర పరిణామాలు చోటుచేసుకోకుండా ఉండాలంటే బొగ్గు, చమురు, సహజవాయువు వినియోగం నుంచి వెలువడే ఉద్గారాలను తక్షణమే, భారీగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.ఈ ఏడాది సదస్సుకు సహ ఆతిథ్యమిస్తున్న టర్కీ, ఆస్ట్రేలియాలకు శనివారం 100 పౌరసంఘాలు లేఖ రాశాయి. ఐరాస చరిత్రలో అత్యంత నిరాశాజనకమైన వాతావరణ సదస్సుల్లో ఒకటిగా కాప్31 మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. మూడు దశాబ్దాలుగా సాగుతున్న వాతావరణ చర్చల్లో ఈ సదస్సు అత్యంత నిరాశ కలిగించే సమావేశంగా మిగిలిపోకుండా కాపాడేందుకు మరికొన్ని గంటలే సమయం ఉందని పేర్కొన్నాయి.2015లో కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. పారిశ్రామికీకరణకు ముందు ఉన్న స్థాయితో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రపంచం ఆ లక్ష్యాన్ని దాటిపోయే అవకాశాలున్నాయని ఐరాస ఈ సదస్సుకు ముందు ప్రకటించింది.''తలుపులు మూసి జరుగుతున్న చర్చల్లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. కాప్31 ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కూడా చెప్పలేం'' అని యాక్షన్ ఎయిడ్ ఇంటర్నేషనల్‌లో వాతావరణ న్యాయ విభాగం గ్లోబల్ లీడ్ తెరెసా ఆండర్సన్ అన్నారు.
ఖాళీగా మారిన సదస్సు ప్రాంగణం.. పెరుగుతున్న అసంతృప్తి...
కాప్31 ప్రాంగణంలోని వివిధ దేశాల పావిలియన్లలో శనివారం సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాలను సర్దుతూ, సామగ్రిని పెట్టెల్లోకి ఎక్కిస్తూ కనిపించారు. గతంలో వేలాది మంది సందర్శకులతో సందడిగా ఉన్న ప్రాంగణం దాదాపు ఖాళీగా మారింది. అక్కడక్కడా కొద్దిమంది భద్రతా సిబ్బంది మాత్రమే కనిపించారు.''కాప్31లో పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఆహారం, నీటి సరఫరా కూడా తగ్గిపోతోంది. ఇంతకుముందు వచ్చిన బలహీనమైన ముసాయిదాల తర్వాత కూడా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు'' అని యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్‌కు చెందిన రేచెల్ క్లేటస్ అన్నారు.గత ఐదేళ్లుగా భూతాపాన్ని తగ్గించే దిశగా ప్రపంచ దేశాల ప్రయత్నాల్లో పురోగతి నిలిచిపోయిందని క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సదస్సు సందర్భంగా హెచ్చరించింది. మరోవైపు ఈ ఏడాది ఐరోపాలో తీవ్ర వేడిగాలులు, నేపాల్‌లో వరదలు వంటి విపత్తులు ప్రాణనష్టాన్ని పెంచాయి.సముద్ర మట్టాలు పెరగడంతో భూములను కోల్పోతున్న చిన్న ద్వీప దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు.. ప్రకృతి విపత్తుల నుంచి కోలుకోవడానికి, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ఐరాస నిధులకు మరింత సాయం చేయాలని అవి కోరుతున్నాయి.''ప్రతి ఏడాది పౌరసంఘాలు, ఆదివాసీలు, వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల్లో అసంతృప్తి, అపనమ్మకం, నిరాశ పెరుగుతున్నాయి'' అని తువాలు పర్యావరణ మంత్రి మైనా తాలియా శనివారం మీడియా సమావేశంలో అన్నారు.''తుది ముసాయిదా వచ్చే వరకు ఆశావాదంతోనే ఉంటాను. నా వైఖరిని మార్చుకోను'' అని చెప్పారు.ప్రపంచంలో అత్యధిక కాలుష్య ఉద్గారాలు విడుదల చేసే దేశాల్లో ఒకటైన అమెరికా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ ఈ ఏడాది చర్చల్లో నేరుగా పాల్గొనలేదు. తదుపరి వాతావరణ సదస్సు 2027 నవంబరులో ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరగనుంది.
నిరసనతో అడ్డంకి.. చర్చలపై ఆందోళన...
శుక్రవారం సదస్సులో ఓ నిరసనకారుడు మెడకు ఎర్రటి ఉరితాడు ధరించి, 'మీరు భవిష్యత్తును చంపేస్తున్నారు' అనే నినాదం ఉన్న దుస్తులతో అధికారిక సమావేశంలోకి వచ్చాడు. ఓ బల్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ చర్చలకు అంతరాయం కలిగించాడు.''శిలాజ ఇంధనాలను తొలగించండి. 1.5 డిగ్రీల లక్ష్యాన్ని మీరు చంపేశారు. నిధులు లేవు. నన్ను ఇప్పుడే చంపేయండి. ప్రపంచ దక్షిణ దేశాలు ఇక వేచి ఉండలేవు'' అని నినదించాడు.ప్రపంచ దక్షిణ దేశాలు అంటే భౌగోళికంగా దక్షిణ ప్రాంతంలోని దేశాలు మాత్రమే కాదు. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈ పదంతో సూచిస్తారు. భద్రతా సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్తుండగా.. ''మీరు ఏమీ చేయడం లేదు. నన్ను చంపేయండి'' అంటూ నినాదాలు కొనసాగించాడు.ఈ ఘటనతో కురుమ్ ప్రసంగానికి అంతరాయం కలిగింది. ''సమావేశ మందిరంలో ప్రశాంతతను కాపాడుకుందాం'' అని ఆయన కోరిన అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.18 వాతావరణ సదస్సులకు హాజరైన ఫాసిల్ ఫ్యూయల్ ట్రీటీ ఇనిషియేటివ్ వ్యూహాత్మక సలహాదారు హర్జీత్ సింగ్ మాట్లాడుతూ.. ''నిన్న ఈ ప్రాంగణం సందడిగా ఉంది. నేడు దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. అయితే కీలక చర్చల్లో పాల్గొనే ప్రతినిధులంతా ఇక్కడే ఉన్నారు. పౌరసంఘాలు కూడా చర్చలను గమనిస్తున్నాయి'' అని చెప్పారు.''ఇప్పటికీ అనేక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు ఇంకెంతకాలం సాగుతాయో ఎవరికీ తెలియడం లేదు'' అని వ్యాఖ్యానించారు.

