Chilakaluripeta : వైసీపీ నేత విడదల రజని మళ్లీ చిలకలూరి పేట నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి తిరిగి చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి గెలిచేందుకు ఆమె ఉవ్విళ్లూరుతున్నారు.
చిలకలూరి పేట నియోజకవర్గంలో జరిగే వైసీపీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ తిరిగి నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నాయకత్వం కూడా చిలకలూరి పేట ఇన్ ఛార్జిగా విడదల రజనిని నియమించడంతో ఆమె మరొకసారి గెలిచి తన సత్తా చూపాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించినట్లు పార్టీ నాయకత్వానికి నివేదికలు అందాయి.
టీడీపీ నుంచి వైసీపీలోకి....
విడదల రజిని 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో 2018లో వైసీపీలో చేరారు. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.విడదల రజిని 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి చేతిలో 51150 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
సామాజికవర్గం పరంగా...
విడదల రజని ఆర్థికంగా బలమైననేత. సామాజికవర్గం పరంగా కూడా ఆమెకు కలసి వచ్చే అంశమే. భర్త కాపు సామాజికవర్గం కావడం కూడా ఆమెకు రాజకీయంగా కలసి వస్తుందని అంటున్నారు. విడదల రజని కుటుంబం విదేశాల్లో వ్యాపారాలు చేసి బాగానే సంపాదించారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వరసగా కేసులు కూడా నమోదు అవుతుండటం విడదల రజనిపై సానుభూతి పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీసీ + కాపు సామాజికవర్గం కలగలిపి ఉండటంతో ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతారని వైసీపీ నాయకత్వం కూడా అంచనా వేస్తుంది. విడదల రజనికి పార్టీ నాయకత్వం అండగా కూడా పుష్కలంగా ఉండటంతో ఈసారి చిలకలూరి పేట నుంచి పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అక్కడ బలమైన నేతగా విడదల రజని ముద్ర పడ్డారు.

