ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత, సెగగాలులతీవ్రత కూడా ఎక్కువగా ఉంది. రోహిణి కార్తె రావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు.
ద్రోణి ప్రభావంతో చిరుజల్లులు కురియడంతో మరింతగా ఎండల తీవ్రత ఎక్కువయింది. గరిష్టంగా 48 డిగ్రీలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని అధికారుల హెచ్చరించారు. పగటి వేళ బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, చిన్నారులు బయటకు రావద్దని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఆంధ్రప్రదేశ్ లో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మిగిలిన చోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ వెల్లడించిన మేరకు 119 మండలాల్లో తీవ్రవడగాలులు,155 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ బయటకు రావద్దని సూచించింది. తప్పనసి సరి పరిస్థితుల్లో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోనూ ఎండల తీవ్రత...తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మ, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. ఎండల తీవ్రత, ఉక్కపోతతో విద్యుత్తు వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. అయితే వాతావరణ శాఖ తెలంగాణకు చల్లని కబురు అందించింది. రెండురోజుల్లో తెలంగాణకు రుతుపవనాలువచ్చే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని,అదే సమయంలో వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల నమోదవుతాయని కూడా పేర్కొంది.

