పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ వన్ సైడ్ విక్టరీ వైపు అడుగులు వేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాను బెంగాల్ ప్రజలు విశ్వసించారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.
293 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే బీజేపీ 186 స్థానాల్లో ముందంజలో ఉంది. టీఎంసీ వంద స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. దీంతో బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని సాధించే దిశగా దూసుకు పోతుంది. మమత బెనర్జీని బెంగాలీలు తిరస్కరించారు. ఇక్కడ మరే పార్టీ దరిదాపుల్లోకి కూడా రాకపోవడం విశేషం.
తొలినుంచి చెబుతున్నట్లుగానే...తొలి నుంచి మోదీ, అమిత్ షాలు బెంగాల్ తమదేనని చెబుతున్నారు. వారు చెబుతున్నట్లే అధికారం కమలం పార్టీకి చేరువగా ఉంది. పశ్చిమ బెంగాల్ లో మూడు దఫాల నుంచి పాలిస్తున్న మమత బెనర్జీ ని టార్గెట్ చేస్తూ చేసిన ప్రచారం జనాల్లోకి వెళ్లింది. మమత బెనర్జీ ఒంటరిపోరు గెలుపునకు నాలుగోసారి అవకాశం చిక్కలేదు. ఎందుకంటే అనేక విషయాలు మమత పరాజయానికి కారణమయ్యాయని చెప్పాలి. మమత పాలనలో చెలరేగిన హింసతో పాటు శాంతి భద్రతలు దెబ్బతినడం కూడా ఆ పార్టీని విజయానికి దూరం చేశాయి. బీజేపీ మ్యానిఫేస్టో...మరొకవైపు బీజేపీ విడుదల చేసిన మ్యానిఫేస్టో బెంగాలీలను ఆకట్టుకుంది. బెంగాలీ రసగుల్లా మాదిరిగా కమలం పార్టీ ఎన్నికల మ్యానిఫేస్టోను రూపొందించి ప్రజలను తమ దరికి చేర్చుకుంది. మరొకవైపు మమత బెనర్జీకి అండగా ఉన్న ఓటు బ్యాంకు ను బలంగా గండికొట్టడానికి ఎస్ఐఆర్ తో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించడమూ ఒక కారణంగా చూడాలి. అనేక మంది అనర్హులు ఓటర్లుగా చెలామణి అవుతున్నారని, వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో తమ విజయం ఖాయమయిందని ముందుగానే బీజేపీ అంచనా వేసింది. వారి అంచనాలకు తగినట్లుగానే తొలిసారి బెంగాల్ లో బీజేపీ పాగా వేస్తుంది.

