రాజకీయాలకు తమ కుటుంబ సభ్యులు బలయిపోయారని వైఎస్ జగన్ అన్నారు. హత్యా రాజకీయాలు చేసేది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. తన తాత రాజారెడ్డి చనిపోయింది చంద్రబాబు హయాంలోనే అని అన్నారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు అన్న మాటలను గుర్తుంచుకోవాలని అన్నారు. అసెంబ్లీకి ఎలా అడుగుపెడతావో చూస్తానంటూ అన్న మరుసటి రోజే తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని జగన్ గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణంపై ఇప్పటికీ అనుమానాలు అలాగే ఉన్నాయని జగన్ అన్నారు.
వివేకా హత్య కేసులోనూ...తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయింది కూడా చంద్రబాబు హయాంలోనేనని అన్న జగన్, తానే చంపానని దస్తగిరి చెప్పినప్పటికీ ఆ నెపాన్ని తమపైనే నెట్టేసేందుకు ప్రయత్నించారని అన్నారు. ఎవరివి శవ రాజకీయాలని జగన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కుని కుట్ర రాజకీయాలు చేసింది ఎవరని జగన్ నిలదీశారన్నారు. వంగవీటి రంగా హత్య వెనక ఎవరున్నారో అందరికీ తెలుసునని జగన్ అన్నారు. అప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉందని జగన్ గుర్తు చేశారు. మరి ఫ్యాక్షన్, క్రిమినల్ మైండ్ ఎవరిదని జగన్ ప్రశ్నించారు. రంగా ప్రధాన హత్య కేసులో నిందితుడు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనని, హత్యా రాజకీయాలు ఎవరివో అందరికీ తెలుసునని జగన్ అన్నారు.

