Andhra Pradesh : వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో కూటమితో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. ప్రధానంగా కమ్యునిస్టు పార్టీలతో ఆయన కలిసి నడిచే అవకాశముంది.
కమ్యునిస్టులతో పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ 2029 ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బలంగా నిలబడేందుకు, అధికార పార్టీపై పోరాడేందుకు వామపక్ష పార్టీల సహకారం అవసరమని జగన్ గుర్తించినట్లు కనపడుతుంది. ఇప్పటికే కొంత సీపీఐకి దగ్గరయ్యారు. సీపీఎంతో కూడా కలసి నడిచేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. పొత్తులో భాగంగా వారికి పెద్దగా పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే అధికారంలో ఉన్న కూటమిపై క్షేత్రస్థాయి పోరాటంలోనూ, విమర్శల విషయంలోనూ తనకు అండగా నిలుస్తారని జగన్ భావిస్తున్నారు. అందుకే తొలి అడుగులో కాకినాడ కార్పొరేషన్ లో సీపీఐ తో పొత్తు పెట్టుకోవడంతో రానున్న ఎన్నికల్లోనూ కామ్రేడ్లతో నడుస్తారన్న విషయం స్పష్టమయింది.
పరిణామాలు ఇలా...
2029 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ మరియు కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినాసానుకూల వాతావరణం నెలకొని ఉందన్న అభిప్రాయం పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతుంది. అయితే, ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహకారం అందుకోవడంతో ఈ చర్చ మొదలయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల మరియు మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమిని ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ మరియు సీపీఐ పరస్పర అవగాహనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సీపీఎం తో కూడా స్థానిక స్థాయిలో సర్దుబాట్లు చేసుకున్నట్లు వార్తలు రావడంతో కామ్రేడ్లతో ఫ్యాన్ పార్టీ బంధం బలపడినట్లు కనపడుతుందన్నది వాస్తవమనే చెప్పాలి.
కమ్యూనిస్టు నేతల షరతులు
2029 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు గురించి కమ్యూనిస్టు నేతలు స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ బీజేపీకి వ్యతిరేకంగా బహిరంగంగా నిలిస్తేనే భవిష్యత్తులో కమ్యూనిస్టులతో పొత్తుకు అవకాశం ఉంటుందని సీపీఐ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఆ విషయంలోనే జగన్ కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో పొత్తులో ఉండకపోయినా, బీజేపీకి బయట నుంచి కూడా మద్దతు ఇవ్వబోమని ప్రకటిస్తేనే రాష్ట్రంలోని కమ్యునిస్టు పార్టీలు ఆయనతో జత కడతాయి. లేకుండా అవి ఒంటరిపోరాటం చేస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటంలో కలసి నడవనున్నాయని అర్థమవుతుంది సెప్టెంబర్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. రామకృష్ణ తదితరులు తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసి కరువు పరిస్థితులు, డీఎస్సీ నియామకాల అంశాలపై ఉమ్మడి పోరాటానికి ఆహ్వానించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిన వైసీపీ, 2029 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పూర్తిస్థాయి పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో జగన్ తీసుకునే జాతీయ రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది

