Andhra Pradesh : వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా నివేదికలను నియోజకవర్గాల వారీగా తెప్పించుకుంటున్నారు. రానున్న ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధించే లక్ష్యంగా నేతల పనితీరు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై నివేదికలను ఒక ప్రయివేటు సంస్థ ద్వారా తెప్పించుకోవడం చర్చనీయాంశమైంది.
ఇటీవల కోనసీమ జిల్లా నేతలతో సమావేశమైన జగన్ నియోజకవర్గాల వారీగా వన్ టూ వన్ సమీక్షలు నిర్వహించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల ఇన్ ఛార్జులు ఏ కార్యక్రమంలో పాల్గొన్నది జగన్ నోటి నుంచి విని నేతలు తెల్లమొహం వేసినట్లు తెలిసింది. ఇంత పకడ్బందీ నివేదికలను జగన్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారన్న అనుమానాలు వారిలో బయలుదేరాయి. సొంత పార్టీలో ప్రత్యర్థులపై తొలుత అనుమానించినా చివరకు ప్రయివేటు సంస్థ ఇచ్చిన నివేదికలని తెలిసింది.
ఎలాగైనా అధికారంలోకి రావాలని...
జగన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అయితే అందుకు కేవలం పార్టీ నేతల మీదనే ఆధారపడి లాభం లేదని, తన చుట్టూ ఉన్న నేతలను కొందరు లోబర్చుకుని తనకు తప్పుడు సమాచారం అందించే అవకాశముందని భావించిన జగన్ ఈ పనిని ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించినట్లు చెబుతున్నారు. రాయలసీమలో కొంత నేతల పనితీరు బాగానే ఉందని నివేదికల్లో తేలింది. ఇక కోస్తాంధ్ర, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి బాగాలేదని జగన్ కు నివేదికల ద్వారా అర్థమయినట్లు తెలిసింది. అందుకే ఇక వరసగా సమావేశాలను ఏర్పాటు చేసి నేతలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేందుక వైసీపీ అధినేత సిద్ధమయినట్లు తెలిసింది. పనితీరు బాగాలేని నియోజకవర్గాల నేతలను పిలిచి మాట్లాడాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను...
ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలను ఇందుకు జగన్ పరీక్షగా పెట్టారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయడమే కాకుండా నెగ్గడమే లక్ష్యంగా పనిచేయాలని జగన్ పదే పదే చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమయితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే నేతలు మాత్రం కొందరు పెడ చెవిన పెడుతున్నారు. తమకు బలమైన ఓటు బ్యాంకు ఉందని, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమయిందని, దానిని అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమయిన నేతలను ఇక ఉపేక్షించకూడదని భావిస్తున్నారు. అందుకోసమే నియోజకవర్గాల ఇన్ ఛార్జులకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు లిట్మస్ టెస్ట్ గా పెడుతున్నారు. ఇందులో ఉత్తీర్ణులయిన వారిక వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు అని జగన్ ఖరాఖండీగా చెబుతున్నారు. మరి జగన్ పెడుతున్న ఈ పరీక్షలో నెగ్గేదెవరు? ఓడెదవరు? అన్నది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

