వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లాలో బలపడే ప్రయత్నం చేయడం లేదు. అక్కడి నేతలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కొందరు యాక్టివ్ గా కనిపిస్తున్నప్పటికీ కాపు సామాజికవర్గం నేతలు మాత్రం పెద్దగా పార్టీ బలోపేతానికి పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు లభిస్తే ఆ పార్టీకి అధికారం దక్కనుంది. అయితే ఆ జిల్లాలో మాత్రం ఫ్యాన్ పార్టీ నేతలు నిర్లిప్తతతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజా సమస్యలపై పోరాటంలోనూ ఇతర జిల్లాలతో పోలిస్తే తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలు పూర్తిగా వెనకబడి ఉన్నారని జగన్ కు కూడా నివేదికలు అందాయి.
గత ఎన్నికల్లో కూటమికి...
కూటమి ప్రభుత్వానికి గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా అండగా నిలిచింది. అయితే ఈ జిల్లాలో ప్రధాన సామాజికవర్గమైన కాపుల్లో కొంత కూటమి సర్కార్ పై అసంతృప్తి ఉంది. ఎక్కువ నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యత కల్పించడంలేదన్న అభిప్రాయంలో ఉన్నారు. అలాగే కాపు కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయకపోవడంతో పాటు, పదవుల్లోనూ తమకు అన్యాయం జరిగిందన్న భావనలో కాపు నేతలతో పాటు క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది. అయితే ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నం వైసీపీ నేతలు చేయడం లేదని తెలిసింది. సంక్షేమ పథకాల అమలులోనూ తమకు చోటు దక్కడం లేదని చాలా మంది ఆరోపిస్తున్నా వీరు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
పవన్ కు పట్టున్న...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పట్టున్న ఈ జిల్లాలో కనీసం కొన్ని స్థానాలనైనా గెలుచుకుందామన్న తాపత్రయం లేదు. తోట త్రిమూర్తులు, మార్గాని భరత్ లాంటి వారు మినహా పెద్దగా ఎవరూ జెండాతో వీధుల్లోకి రావడం లేదు. ముద్రగడ పద్మనాభం సయితం ఆరోగ్య పరిస్థితుల కారణంగా బయటకు రావడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలకు వైసీపీలో కొదవలేదు. సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వాయిస్ వినిపించడంలో మాత్రం వెనకబడి పోయారు. ఇక్కడ ఫ్యాన్ పార్టీ రైజ్ కాకుంటే వచ్చే ఎన్నికల్లోనూ మొన్నటి ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని, ఇప్పటికైనా నేతలు యాక్టివ్ కావాలని వైసీపీ క్యాడర్ కోరుకుంటుంది. మరి నేతలు ముందుకు వస్తారా? లేదా? అన్నది చూడాలి.

