ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, ఆ పార్టీ అనుకూల కొందరు జర్నలిస్టులు చేస్తున్న హడావుడి చూస్తుంటే..
శత్రువుల దాడి కంటే సొంత వాళ్ల అత్యుత్సాహమే పార్టీని ఎక్కువ ముంచేలా ఉందనే టాక్ గట్టిగా నడుస్తోంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై బురద జల్లాలనే కసిలో.. సదరు యూట్యూబ్ జర్నలిస్టులు కొత్తగా ఉద్యోగాలు వచ్చిన టీచర్లు పనిచేస్తున్న స్కూళ్లకు వెళ్లి కెమెరాలు పెట్టి బెదిరింపు ధోరణిలో ప్రశ్నలు వేయడం ఒక రేంజ్‌కు చేరింది.
అయితే ఈ ‘అతి’ వ్యవహారం ఇప్పుడు రివర్స్ కొట్టి, రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుకు కోలుకోలేని దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. అసలు కథ ఏంటంటే.. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రాత్రింబగళ్లు కష్టపడి, కోచింగ్‌లు తీసుకుని అతికష్టం మీద మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన మధ్యతరగతి, పేద అభ్యర్థుల ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి వైసీపీ శ్రేణులు రచ్చ చేస్తుండటంతో సదరు అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన, భయం మొదలయ్యాయి.
“ఏంటి బాస్.. ఎంతో కష్టపడి చదివి చట్టబద్ధంగా ఉద్యోగం తెచ్చుకుంటే, మమ్మల్ని ఇలా దొంగల్లాగా చూపిస్తారా? రేపు పొరపాటున వీళ్లు అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు పీకేస్తారా ఏంటి?” అనే భయాందోళనలు కేవలం ఆ అభ్యర్థుల్లోనే కాదు, వారి వెనుక ఉన్న వేలాది కుటుంబాల్లోనూ మొదలయ్యాయి. ఒక రకంగా కొత్త టీచర్లను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా వారి కుటుంబాల ఓట్లను వైసీపీ శాశ్వతంగా కోల్పోయేలా సొంత తమ్ముళ్లే ప్లాన్ చేసినట్లుంది.
ఇంకో మైనస్ యాంగిల్ ఏంటంటే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగులకు బలమైన గాలం వేసింది. “ఇది కేవలం మొదటి డీఎస్సీ మాత్రమే.. రాబోయే ఐదేళ్లలో ఇంకా మూడు మెగా డీఎస్సీలు వేస్తాం” అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు తదుపరి నోటిఫికేషన్ల కోసం పుస్తకాలు పట్టి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఇప్పుడు వచ్చిన మొదటి డీఎస్సీకే వైసీపీ ఈ రేంజ్‌లో యాగీ చేసి, కోర్టుల చుట్టూ తిప్పుతూ, ఉద్యోగాలు వచ్చిన వాళ్లను విలన్లుగా చిత్రీకరిస్తుంటే.. రేపు రాబోయే మూడు డీఎస్సీల అభ్యర్థుల్లో ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయి..?
“మేము రేపు ఉద్యోగాలు సాధించినా ఈ వైసీపీ వాళ్లు ఇలాగే కోర్టులకు వెళ్లి రచ్చ చేస్తారు, మా నోటికాడి కూడు లాక్కుంటారు” అనే తీవ్రమైన వ్యతిరేకత నిరుద్యోగ లోకంలో ముద్ర పడిపోతుంది. ఇద్దరు లేడీ ఆఫీసర్లు, తమీమ్ అన్సారియా ఐఏఎస్, భరణి ఐఎఫ్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి “అంతా ఆన్‌లైన్‌లో జీవోల ప్రకారమే పారదర్శకంగా జరిగింది.. దమ్ముంటే స్కిల్ టెస్ట్ పెట్టుకుందాం” అని ఓపెన్ ఛాలెంజ్ విసిరినప్పుడే వైసీపీ ఈ టాపిక్‌ను వదిలేసి ఉంటే గౌరవంగా ఉండేది. అది వదిలేసి, ఇంకా బురద జల్లాలని చూస్తే.. ఆ బురద కాస్తా వచ్చే ఎన్నికల్లో పడే నిరుద్యోగుల ఓట్లను తుడిచేయడం ఖాయం. కాబట్టి, వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఇప్పటికైనా ఈ డీఎస్సీ పులి తోకను వదిలేసి ప్రశాంతంగా నిద్రపోవడం.. పార్టీ భవిష్యత్తుకు, జగన్ గారి మిగిలిన ఓటు బ్యాంకుకు చాలా మంచిది.

