Monday, 18 Jan, 3.01 am Telugu Rajyam

తెలంగాణ
ఖమ్మం మీద కన్నేసిన బీజేపీ. మాకు పోటీ కాంగ్రెస్ మాత్రమే అంటున్న టీఆర్ఎస్

ఖమ్మంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ హవానే కొనసాగుతుండగా.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాకతో బీజేపీ ఫాంలోకి వచ్చినట్లయింది. ఇరు నేతల మాటలతో రెండు పార్టీలు రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇటీవల ఖమ్మం వచ్చిన బండి సంజయ్ కేవలం మంత్రి పువ్వాడనే ఫోకస్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతే ప్రధాన అస్త్రంగా తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అధికార పార్టీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 'బండి'కి ధీటుగానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ధ్వజమెత్తడంతో రెండు పార్టీల్లో కాక మొదలైంది.

BJP, Trs parties focusing on Khammam Corporation

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు నోటిఫికేషన్ రాకముందు నుంచే అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే గులాబీ, కమలం పార్టీలు ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతున్నాయి. పోయినసారి ఎన్నికలు జరిగిన ఖమ్మం కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 34 టీఆర్ఎస్ గెలుచుకోగా.. ఏడుగురు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు వైసీపీ నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సారి 60 డివిజన్లకు ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఎలాగైనా పీఠాన్ని మళ్లీ దక్కించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే.., గ్రేటర్ జోష్ మీదున్న బీజేపీ సైతం ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం ఎలాగైనా సాధ్యమైనన్ని స్థానాలు దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఐదేండ్ల క్రితం ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అజయ్ కుమార్ ఒక్కరే గెలిచారు. అప్పుడు ఈ రెండు పార్టీలు మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా ఉండేవి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం గులాబీ గుమ్మంగా మారింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలందరూ ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. త్వరలో జరిగే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలపైనే ప్రధానంగా బీజేపీ కన్నేసింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం కార్పొరేషన్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే ఇటీవల బండి సంజయ్ పర్యటన, మంత్రిపై తన విమర్శలతో జిల్లాలో కమలం పార్టీ ఒక్కసారిగా పుంజుకున్నట్లయింది. మంత్రి అజయ్ మాత్రం బీజేపీ అంటురోగం పార్టీ అని.. అసలు లెక్కలోకి తీసుకోమని.. కాంగ్రెస్సే జిల్లాలో తమకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పారు. కానీ జిల్లాలో పరిస్థితులను చూస్తుంటే రాబోయే అన్ని ఎన్నికల్లో కమలానికి, గులాబీకి మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam

related stories

Top