Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైలెంట్ గా దెబ్బ కొడుతున్న ఇరాన్.!

సైలెంట్ గా దెబ్బ కొడుతున్న ఇరాన్.!

Telugu Rajyam 7 hrs ago

మెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తాజాగా సరికొత్త అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక జలమార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' ప్రవేశద్వారం వద్ద అమెరికా సైన్యానికి చెందిన అత్యంత ఆధునిక, స్మార్ట్ అన్‌మ్యాన్డ్ సబ్‌మెరైన్‌ను తాము విజయవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ నావికాదళం అధికారికంగా ప్రకటించింది.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారిక వార్తా సంస్థ సెపా న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ద్వారా 'డైవ్-ఎల్డీ' గా పిలిచే ఈ అండర్ వాటర్ డ్రోన్‌ను ఇరాన్ దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

అంతేకాకుండా, అదే ప్రాంతంలో ఆకాశంలో నిఘా వేస్తున్న అమెరికాకు చెందిన 'MQ-9 రీపర్' డ్రోన్‌ను కూడా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించి, ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం విడుదల చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఇరాన్ ప్రకటనలపై అమెరికా రక్షణ శాఖ భిన్నంగా స్పందించింది. తమ అండర్ వాటర్ డ్రోన్ కేవలం సాంకేతిక లోపం కారణంగా నీటిలో నిలిచిపోయిందని, అంతేకానీ ఇరాన్ దళాలు దాన్ని వేటాడి పట్టుకోలేదని అమెరికా సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

అంతేకాకుండా, ఇరాన్ ఆధీనంలోకి వెళ్లిన సబ్‌మెరైన్ పాత మోడల్ అని.. అందులో ఎలాంటి క్లాసిఫైడ్ సోనార్, రాడార్ పరికరాలు లేదా సున్నితమైన నిఘా సమాచారం లేవని పెంటగాన్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరాన్ చేజిక్కించుకున్నట్లు చెబుతున్న ఈ 'Dive-LD' డ్రోన్ సబ్‌మెరైన్లు సముద్రంలో ఏకంగా 6,000 మీటర్ల లోతు వరకు ప్రయాణించగలవని, ఒక్కొక్క దాని విలువ సుమారు 2.5 మిలియన్ డాలర్లు ఉంటుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఇరాన్‌పై భారీ ప్రతీకార చర్యకు దిగింది.

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడికి ప్రయత్నించినందుకు సమాధానంగా.. ఇరాన్‌కు చెందిన ఐదు ముడి చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. దీనికి తోడు ఉగ్రవాద చర్యలకు సహకరిస్తున్నాయనే ఆరోపణలతో ఇరాన్‌కు చెందిన 27 కమర్షియల్ ఎయిర్‌లైన్స్ సంస్థలపై అమెరికా ఆర్థిక శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇజ్రాయెల్, అమెరికా కూటమి ఇరాన్ నగరాలపై దాడులు చేసినప్పటి నుండి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జూన్‌లో ఇరుదేశాలు కాల్పుల విరమణ చర్చల కోసం ఒప్పందం చేసుకున్నప్పటికీ.. తాజాగా డ్రోన్ల కూల్చివేత, చమురు ట్యాంకర్ల ధ్వంసంతో పశ్చిమ ఆసియాలో పరిస్థితి మళ్లీ అత్యంత భయానకంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam