Toxic Movie: కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు.
జూన్ 4, 2026న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ మారనుంది. త్వరలోనే ఈ కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాకాన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి 'టాక్సిక్'కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత అంతర్జాతీయ విడుదలకు అవకాశాలను కల్పించాలని, తమ ప్లానింగ్స్‌ను, రిలీజ్ డేట్‌లను పునఃసమీక్షించుకుంటున్నారు.
'టాక్సిక్' వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులందరికీ చేరేలా నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీని ఖరారు చేయడం, కీలకమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రానికి యష్, గీతూ మోహన్‌దాస్ రచన చేయగా.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.
"మేము సాధారణంగా తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, మరికొన్ని సినిమాలు అసలు మనం సినిమాను ఎందుకు ప్రేమించామో గుర్తు చేస్తాయి. 'టాక్సిక్' అలాంటి ఒక ప్రయాణమే. సినిమాకాన్‌లో మా చిత్రాన్ని ప్రదర్శించిన తరువాత.. అక్కడ వచ్చిన స్పందనను చూసిన తరువాత.. ఇది వరల్డ్ వైడ్‌గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది.
'టాక్సిక్' సినిమా పూర్తయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యాలను కాంటాక్ట్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో మేము మా విడుదల తేదీని పునఃసమీక్షించాలని నిర్ణయించుకున్నాము. గతంలో ప్రకటించినట్లుగా మేము జూన్ 4న విడుదల చేయలేకపోతోన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన తదుపరి విడుదల తేదీని త్వరలోనే చెబుతాం. 'టాక్సిక్' త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
భారతీయ సినిమా తన సత్తాను వరల్డ్‌వైడ్‌గా చాటుతూ, గొప్ప భవిష్యత్తుతో ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో దాని స్థాయిని మరింత పెంచాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమ కోసం, మనందరి కోసం నా వంతు పాత్ర పోషించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను.

