Dailyhunt
'200 సీట్లు గెలుస్తాం.. కౌంటింగ్ పూర్తయ్యేదాకా అక్కడే ఉండండి': కౌంటింగ్ ఏజెంట్లకు దీదీ సూచన

'200 సీట్లు గెలుస్తాం.. కౌంటింగ్ పూర్తయ్యేదాకా అక్కడే ఉండండి': కౌంటింగ్ ఏజెంట్లకు దీదీ సూచన

Telugu Samayam 1 week ago

Mamata Banerjee TMC 200 Plus Seats: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. అందరిలోనూ ఎవరు గెలుస్తారనే ఆతృత ఎక్కువవుతోంది.

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని జోస్యం చెబుతున్న తరుణంలో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తాము 200కు పైగా సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా శనివారం 291 నియోజక వర్గాల కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ పద్ధతిలో సుదీర్ఘంగా భేటీ అయిన ఆమె.. టీఎంసీ ఘనవిజయం సాధించబోతోందని స్పష్ట చేశారు. ఈక్రమంలోనే కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు అక్కడి నుంచి ఏ ఒక్కరూ కొదలొద్దని చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ 'స్టాక్ మార్కెట్' మాయాజాలమే..!

టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఏమాత్రం పట్టించుకోవద్దని మమత బెనర్జీ తన ఏజెంట్లకు సూచించారు. "ఈ సర్వేలకు ఎలాంటి విలువ లేదు. 2021, 2024లో కూడా ఇలాగే తప్పుడు అంచనాలు వేశారు. ఇదంతా కేవలం స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకు బీజేపీ ఆడుతున్న నాటకం" అని ఆమె మండిపడ్డారు. తమ పార్టీ కచ్చితంగా 200 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీదీ ధీమా వ్యక్తం చేశారు.


ఓట్ల లెక్కింపు రోజున ఏజెంట్లు అనుసరించాల్సిన వ్యూహంపై మమత మరియు అభిషేక్ బెనర్జీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పూర్తయ్యే వరకు ఏ ఏజెంటూ కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లకూడదని అన్నారు. ఫలితం ఏదైనా సరే.. ప్రక్రియ మొత్తం ముగిసినట్లు ధృవీకరించుకోవాలని చెప్పారు. ఒకవేళ తమ అభ్యర్థి 200 నుంచి 300 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోతున్నట్లు కనిపిస్తే.. వెంటనే రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏమరపాటుగా ఉండొద్దని హెచ్చరించారు. 2021లో నందిగ్రామ్‌లో లెక్కింపు సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ నిలిపి వేసినట్లుగా ఏవైనా అసాధారణ ఘటనలు జరిగితే.. వెంటనే పార్టీ అగ్ర నాయకత్వానికి సమాచారం అందించాలని అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద హైడ్రామా

ఇప్పటికే కోల్‌కతాలోని కొన్ని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పారదర్శకత లేదంటూ టీఎంసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత గురువారం సఖావత్ మెమోరియల్ స్కూల్ వద్ద మమతా బెనర్జీ స్వయంగా నాలుగు గంటల పాటు నిరసన తెలిపారు. అక్కడే కూర్చుని మరీ స్ట్రాంగ్ రూముల్లోని బ్యాలెట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తున్నారంటూ వివరించారు. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మనోజ్ అగర్వాల్ స్పందిస్తూ.. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అక్రమాలకు తావులేదని, కట్టుదిట్టమైన భద్రత ఉందని హామీ ఇచ్చారు. చూడాలి మరి పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని నిలపబోయేది బీజేపీయా, టీఎంసీ అనేది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam