Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
25 నిమిషాల్లో 14 కి.మీ.లు, 13 స్టేషన్లు.. తొలిసారి హైదరాబాద్ మెట్రోలో గుండె, ఊపిరితిత్తులు.. గ్రీన్ ఛానెల్‌ ద్వారా తరలింపు

25 నిమిషాల్లో 14 కి.మీ.లు, 13 స్టేషన్లు.. తొలిసారి హైదరాబాద్ మెట్రోలో గుండె, ఊపిరితిత్తులు.. గ్రీన్ ఛానెల్‌ ద్వారా తరలింపు

Telugu Samayam 1 week ago

ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవల్లో హైదరాబాద్ మెట్రో మరోసారి కీలక పాత్ర పోషించింది. అవయవ మార్పిడి కోసం అత్యంత విలువైన సమయాన్ని ఆదా చేస్తూ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి గుండె, ఊపిరితిత్తులను కేవలం 25 నిమిషాల్లో గమ్యస్థానానికి చేర్చింది.

గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి అవయవాలను వేగంగా తరలించి మరో ప్రాణానికి కొత్త ఆశ కల్పించింది. సాధారణంగా నగర ట్రాఫిక్ కారణంగా ఈ ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది.

అందుకే హైదరాబాద్ మెట్రో అధికారులు, ఎల్ అండ్ టీ మెట్రో, వైద్య బృందం సమన్వయం చేసుకుని.. మెట్రో రైలులో ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి అవయవాలతో వైద్య బృందం ప్రత్యేకంగా ప్రయాణం ప్రారంభించింది. దాదాపు 14 కిలోమీటర్ల దూరంలోని 13 మెట్రో స్టేషన్లను దాటుకుని కేవలం 25 నిమిషాల్లోనే మెట్రో రైలు రసూల్‌పురా మెట్రో స్టేషన్‌కు చేరుకుంది.


ఉదయం 11:40 గంటలకు రాయదుర్గం నుంచి బయలుదేరిన మెడికల్ టీమ్.. మధ్యాహ్నం 12:05 గంటలకు రసూల్‌పురా స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ముందుగానే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆస్పత్రికి గుండె, ఊపిరితిత్తులను వేగంగా తరలించారు. సమయానికి అవయవాలు అందడంతో డాక్టర్లు.. అవయవాల మార్పిడి ఆపరేషన్‌ను పూర్తి చేశారు.

అవయవ మార్పిడి వంటి టైమ్ క్రిటికల్ మెడికల్ ట్రీట్‌మెంట్‌లలో ప్రతి నిమిషం ఎంతో కీలకంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ట్రాఫిక్‌కు అతీతంగా వేగవంతమైన రవాణా అందించడంలో మెట్రో కీలక వేదికగా మారుతోంది. గతంలోనూ పలుమార్లు గ్రీన్ ఛానెల్ ద్వారా అవయవాలను వేగంగా తరలించిన హైదరాబాద్ మెట్రో, మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది.

ఈ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్‌లో సహకరించిన హైదరాబాద్ మెట్రో అధికారులు, మెట్రో సిబ్బంది.. డాక్టర్ల బృందం, ట్రాఫిక్ పోలీసులకు ఆస్పత్రి వర్గాలు, బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు, ప్రాణాలను కాపాడే కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ పూర్తి సహకారం అందిస్తామని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam