Dailyhunt
29 అక్షరాల పదాన్ని పలికిన ఢిల్లీ న్యాయమూర్తి.. అసలేమిటీ ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్‌?

29 అక్షరాల పదాన్ని పలికిన ఢిల్లీ న్యాయమూర్తి.. అసలేమిటీ ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్‌?

Telugu Samayam 1 month ago

Floccinaucinihilipilification Meaning: న్యాయ స్థానాల్లో వాడే భాష చాలా క్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా తీర్పులు, పిటిషన్ వంటివి చూస్తే సాధారణ పౌరులకు అంతగా అర్థం కూడా కాదు.

కానీ ఇంతకు మించిన కష్టమైన పదాన్ని ఉపయోగించారో న్యాయమూర్తి. ముఖ్యంగా ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఒక తీర్పులో.. 29 అక్షరాల పదాన్ని వాడారు. 'ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్‌' (Floccinaucinihilipilification) అనే పదం పలకడానికే కష్టంగా ఉండగా.. న్యాయమూర్తి మాత్రం ఎంచక్కా చెప్పేశారు. మరి దీని అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా?

అసలు న్యాయమూర్తి ఈ పదం ఎందుకు వాడారు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మేల్యే సోమనాథ్ భారతి భార్య లిపికా మిశ్రా గతంలో ఒక పరువు నష్టం దావా వేశారు. 2024 ఎన్నికల సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తన వైవాహిక జీవితాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ సందర్భంగా సదరు ఆరోపణల్లో ఎలాంటి పస లేదని చెప్పడానికి ఈ వింత పదాన్ని ఉపయోగించింది. లిపికా మిశ్రా వేసిన ఈ పిటిషన్ పూర్తిగా అర్హత లేనిదని.. దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేయడానికి న్యాయమూర్తి ఈ భారీ పదాన్ని ప్రయోగించారు.

అసలేంటీ ఈ 'ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్‌'?

సాధారణంగా మనం ఏదైనా వస్తువును లేదా విషయాన్ని "విలువ లేనిది" లేదా "పనికిరానిది" అని చెప్పడానికి యూజ్‌లెస్ లేదా వర్త్‌లెస్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. కానీ ఇంగ్లీష్ భాషపై పట్టున్న వారు ఇలాంటి పెద్ద పెద్ద పదాలను వినియోగిస్తారు. అచ్చంగా ఇదే పని చేశారు న్యాయమూర్తి. విలువ లేనిది అని చెప్పడానికే జడ్జి ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్‌ పదాన్ని వాడారు. అయితే ఈ పదం లాటిన్ భాష నుంచి పుట్టింది. ఇందులో flocci, nauci, nihili, pili అనే నాలుగు పదాలు ఉన్నాయి. ఈ నాలుగింటికీ విడివిడిగా విలువలేని, శూన్యం అనే అర్థం వస్తాయి. గతంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా తన ట్వీట్లలో ఈ క్లిష్టమైన పదాన్ని వాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయన ద్వారానే ఈ పదం ఒకప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోర్టు తీర్పులో ఇది కనిపించడంతో నెటిజన్లు దీని అర్థం కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

అసలీ పదాన్ని ఎలా పలకాలి?

చూడటానికి కొండవీటి చాంతాడులా ఉన్న ఈ పదాన్ని పలకడం కూడా ఒక సాహసమే. దీనిని 'ఫ్లాక్-సి-నా-సి-ని-హి-ల-పి-ల-ఫి-కే-షన్' అని విడదీసి పలకాలి. రోజువారీ సంభాషణల్లో దీనిని అస్సలు వాడరు. కానీ సాహిత్యపరంగా లేదా విద్వత్తును ప్రదర్శించే క్రమంలో అరుదుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఢిల్లీ కోర్టు తీర్పుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ 29 అక్షరాల పదం.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam