ఓవైపు భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు ఇలా వరుస ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు, తరచూ రాజకీయ సంక్షోభాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులతో హిమాలయ రాజ్యం నేపాల్ (Nepal Floods) ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
తాజా జల ప్రళయం కూడా నేపాల్ ఎదుర్కొనే విపత్తును కళ్లకుకట్టింది. అయితే, ఇలాంటి కష్టాలు తమకు అలావాటేనని, కోలుకోవడం కూడా సాధారణమేనని ఆ దేశం చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితుల వెనుక ప్రచారంలో ఉన్న ఓ జానపద గాథ తెరపైకి వచ్చింది.
సతి శపించిన దేశం
'సతి లె సరాపేకో దేశ్'అంటే 'సతి శపించిన దేశం' (Sati Cursed). నేపాల్ సంస్కృతి, చరిత్రలో ఈ పదానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఉంది. రాజరిక పాలన అంతమైన సమయం నుంచి.. దేశంలో తరచూ ఏర్పడే రాజకీయ సంక్షోభం, నాయకత్వ వైఫల్యం, అధికార మార్పిడి జరిగిన సందర్భాల్లో ఇది వినిపిస్తుంది. తరచూ ఈ మాటను నేపాలీలు గుర్తుచేసుకుంటారు. అంతేకాదు, నేపాల్‌లో తరుచూ సంభవించే ప్రకృతి విపత్తుల (Nepal Flash Floods) సమయంలోనూ స్మరించుకుంటారు. ఇంతకీ ఈ పదం ఎక్కడ నుంచి వచ్చింది? దేశాన్ని శపించిన మహిళ ఎవరు? ఆ విషాద గాథ వెనుక ఉన్నందేంటి? తన భర్త చితిలోకి దూకినప్పుడు ఆమె పెట్టిన కన్నీళ్లే కారణమా? అసలు ఇంతకీ ఏం జరిగింది?నాలుగు వందల ఏళ్ల కిందట 17వ శతాబ్దంలో నేపాల్‌ను ఒక శక్తివంతమైన రాజ్యం పాలిస్తున్న కాలంలో ఒక దారుణమైన నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం శతాబ్దాలుగా ఆ దేశ చరిత్రను నీడలా వెంటాడుతూనే ఉంది. కాఠ్మాండు లోయను పాలించే మల్ల రాజుల కాలంలో రాజసభలో ఎంతో నమ్మకస్తుడైన ఒక అధికారిపై కుట్ర జరిగింది. ఆ తర్వాత ఆయనకు మరణశిక్ష పడింది. ఆయన భార్య ఆక్రోశపూరిత మాటలు... ఒక ముక్కలో ఆ దేశానికే ఒక భయంకరమైన పేరును తెచ్చిపెట్టాయి. తరాలు మారినా ఆ మాటలు నేటికీ జనుల నాలుకలపై నానుతూనే ఉన్నాయి. దీని వెనుక మల్ల రాజవంశం నాటి కుట్రలు, కాజీ భీమ్ మల్ల, ఆయన భార్య భువనలక్ష్మిల విషాదాంత కథ ఉంది.
కాఠ్మాండు లోయను మల్ల రాజులు పాలిస్తున్న కాలంలో రాజసభలు, అధికార దాహాలు, కుట్రలకు నిలయంగా ఉన్న సమయం అది. నాటి రాజు లక్ష్మీ నరసింహ మల్ల వద్ద భీమ్ మల్ల అనే సమర్ధవంతుడైన సేనాధిపతి ఉండేవారు. సైనిక వ్యవహారాలతో పాటు పాలనలో భీమ్ ముద్ర ఉండేది. నేపాల్ - టిబెట్ మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజుకు అన్ని విషయాల్లోనూ అండగా ఉండే ఆయనకు పెరుగుతున్న ప్రతిష్ఠే ఆయనకు ప్రాణాంతకంగా మారింది. భీమ్ మల్ల ఎదుగుదల చూసి ఓర్వలేని సామంతరాజులు ఆయనపై కుట్ర పన్నారు. రాజు మనసులో భీమ్ పట్ల అనుమాన బీజాలు నాటారు. ఆయన సింహాసనానికే ప్రమాదకరమని రాజుకు లేనిపోనివన్నీ నూరుపోసి నమ్మేలా చేశారు.
నమ్మకస్తుడైన అధికారికి మరణశిక్ష
చెప్పుడు మాటలను విన్న రాజు.. తన సింహాసనానికి ముప్పు మారుతున్నాడేమోనని అనుమానించారు. అసత్య ఆరోపణలతో భీమ్ మల్లాను బంధించి, ఎలాంటి విచారణ జరపకుండా మరణశిక్ష అమలు చేశారు. రాజ్యం కోసం అహర్నిశలు శ్రమించిన ఒక నిరపరాధి, రాజభవన కుట్రలకు బలైపోయాడని దాదాపు అన్ని చారిత్రక కథనాలు చెబుతాయి. అయితే, ఈ కథలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘట్టం ఆయన మరణం తర్వాత జరిగింది.భీమ్ మరణాన్ని ఆయన భార్య భువనలక్ష్మి తట్టుకోలేకపోయారు. ఆ కాలంలో నేపాల్‌లో 'సతి' ఆచారం అమలులో ఉండేది. భర్త మరణిస్తే భార్య కూడా ఆయన చితిలో దూకి ఆత్మార్పణం చేయాల్సి వచ్చేది. భువనలక్ష్మి సతీసహగమనానికి ముందు... తన భర్తకు జరిగిన ఘోర అన్యాయాన్ని తలుచుకుని ఆ రాజ్యాన్ని శపించారట. ''ఈ రాజ్యంలో నిరపరాధులకు న్యాయం జరగదు. నా భర్తకు చేసిన ఈ ద్రోహానికి గాను... ఈ రాజ్యాన్ని ఏలేవారు గానీ, ఈ దేశం గానీ ఎన్నటికీ శాంతిసౌఖ్యాలతో వర్ధిల్లదు.. నా భర్తను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న ఈ నేల సర్వనాశనం అవుతుంది!'' అని శాపం ఇచ్చారట.
భువన లక్ష్మి ఆక్రోశం
అయితే, రాజు తన తప్పునకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని.. ఆయన కాలంలోనే వరదలు సంభవించాయని అంటారు. అలా భువన లక్ష్మీ శాపం వందల సంవత్సరాలుగా వెంటాడుతుందనే ఓ జానపద కథ ప్రచారంలోకి వచ్చింది. ఆమె ఆక్రోశం నుంచే 'సతి లె సరాపేకో దేశ్' అనే నానుడి పుట్టుకొచ్చింది. కాలక్రమేణా ఇది కేవలం భువనలక్ష్మి శాపానికి మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్‌లో తరచూ తలెత్తే రాజకీయ సంక్షోభాలకు, అధికార పోరాటాలు, పాలకుల వైఫ్యలాలతో పాటు విపత్తుల సమయంలో తమ ఆవేదన, నైరాశ్యాన్ని వ్యక్తం చేశానికి ఈ పదబంధాన్ని వ్యంగ్యంగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మెరుపు వరదల వల్ల ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.కేవలం జానపద కథ!
భువనలక్ష్మి శాపమే నేపాల్ భవిష్యత్తును మార్చేసిందని చెప్పడానికి ఎలాంటి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది ఒక చారిత్రక కాలానికి, వ్యక్తులకు ముడిపడి ఉన్న ఒక సాంప్రదాయ కథనం లేదా జానపద కథ మాత్రమే. అయితే, శతాబ్దాలు గడిచినా ఈ కథ నేటికీ ఎందుకు గుర్తుండిపోయిందంటే... దీని వెనుక ఉన్న ఒక విషాదం. ఒక సమర్థుడైన అధికారి కుట్రలకు బలయ్యాడు.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన భార్య, తన చివరి క్షణాల్లో ఆ అన్యాయాన్ని నిరసిస్తూ శాపనార్థాలు పెట్టింది.ఈ రోజుకూ నేపాల్ ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక చిక్కులకు ఈ కథ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఆ శాపాన్ని నమ్మినా, నమ్మకపోయినా... అధికారం, అనుమానం, అన్యాయం ఏకమైతే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో 'సతి లె సరాపేకో దేశ్' కథ నేపాల్‌కు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుంది.

