హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ కాలేజీల గుర్తింపు ప్రక్రియలో భారీ ఫోర్జరీ వ్యవహారం.. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం ప్రైవేటు జూనియర్ కాలేజీలు సమర్పించిన ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీల్లో(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) నకిలీ పత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 8 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నకిలీ ఎన్‌వోసీలను తయారు చేసిఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
ఈ వ్యవహారాన్ని గుర్తించిన హైడ్రా అధికారులు.. ఈ ఫోర్జరీ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టారు. అధికారుల పరిశీలనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం నకిలీగా సృష్టించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా అదనపు డైరెక్టర్ ఫిర్యాదు మేరకు లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, నకిలీ పత్రాల తయారీ, మోసం వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే.. ఇదే ఫోర్జరీ సంతకాల కేసులో మరో సంచలన విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన నాగిరెడ్డి పేరుతో కూడా కొంతమంది కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. కానీ నాగిరెడ్డి గతంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేయగా.. ఆ తర్వాత ఆయన బదిలీ అయి.. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ డీజీ స్థానంలో నాగిరెడ్డి లేకపోయినా.. ఆయన పేరు, సంతకాలతో ఉన్న ఎన్ఓసీలను సమర్పించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు అధికారులు వాటి పత్రాలను పరిశీలించగా మొత్తం 8 కళాశాలలు నకిలీ ఎన్‌వోసీలు సృష్టించినట్లు బయటపడింది.
ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని హైడ్రా అధికారులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సిఫార్సు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం మరో 60కు పైగా కాలేజీలు సమర్పించిన ఎన్‌వోసీలను కూడా అధికారులు క్షుణ్నంగా పరిశీలన చేస్తున్నారు. అవసరమైతే ఈ ఫోర్జరీ వ్యవహారంలో మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో నకిలీ ఎన్‌ఓసీలు ఉన్న కాలేజీల యాజమాన్యాలు భయపడుతున్నాయి.
విద్యాసంస్థలు భద్రతా నిబంధనలను పాటించకుండా నకిలీ ధ్రువపత్రాలతో గుర్తింపు పొందేందుకు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతతో రాజీ పడే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని.. రూల్స్ అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు.

