Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ రోజు నాపై భౌతిక దాడి జరిగితే జగన్ ప్రేక్షకపాత్ర పోషించారు.. విజయసాయిరెడ్డి సంచలన లేఖ..

ఆ రోజు నాపై భౌతిక దాడి జరిగితే జగన్ ప్రేక్షకపాత్ర పోషించారు.. విజయసాయిరెడ్డి సంచలన లేఖ..

Telugu Samayam 1 week ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. వైసీపీ శ్రేణులు నమ్మక ద్రోహి అంటూ సోషల్ మీడియా వేదికగా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి..

వాటికి కౌంటర్‌గా ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రెండు పేజీల సుదీర్ఘ లేఖ పోస్ట్ చేశారు. తాను నమ్మకద్రోహినే అయితే.. సజ్జల మాదిరిగా కాంగ్రెస్ పార్టీతో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ చార్జిషీట్లో తన పేరు లేకుండా చేసుకునేవాడినని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నమ్మకస్తుడిని అనే ఒకే ఒక్క కారణంగా జగన్‌తో పాటు ప్రతి చార్జిషీట్లోనూ తనను ఎ-2గా చేర్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉంటే, తనను కూడా 15 నెలలు జైల్లో పెట్టారని.. నమ్మక ద్రోహం తన రక్తంలో ఉంటే, అప్పుడే అప్రూవర్‌గా మారేవాడినని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. మరోవైపు 2024 ఎన్నికల తర్వాత కూడా లిక్కర్ స్కామ్, కాకినాడ సీపోర్టు కేసులలో తనను నిందితుణిగా చేర్చారన్న విజయసాయిరెడ్డి.. రెండున్నరేళ్ల కూటమి పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఏ ఛార్జిషీట్‌లోనూ లేదని పేర్కొన్నారు.

ఎవరా కోటరీ నాయకుడు.. ఎవరా ఉత్తరాంధ్ర నాయకుడు.?

మరోవైపు కోటరీ నాయకుడు అంటూ విజయసాయరెడ్డి తన లేఖలో పేర్కొనడం సంచలనం రేపుతోంది. పేరు ప్రస్తావించకుండా కోటరీ నాయకుడు అంటూ విజయసాయిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడుస్తూ, ఆయనకు తెలవకుండా టీడీపీతో కలిసి ఎలా పని చేయాలో, ఏ కేసులూ లేకుండా ఎలా చేసుకోవాలో "కోటరీ నాయకుడు"కి తెలిసినంత తనకు తెలియదన్న విజయసాయిరెడ్డి.. తాను ఏనాడూ అలాంటి నమ్మక ద్రోహం పనులు చేయలేదన్నారు. అలాగే ప్రస్తుతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడితో కలిసి కోటరీ నాయకుడు, 2020 నుంచి జగన్ వద్ద తన గురించి చాడీలు చెప్పి, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తనను తప్పించేందుకు కారణమయ్యారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

అందుకే వైసీపీకి రాజీనామా.. విజయసాయిరెడ్డి

వైఎస్ కుటుంబం కోసం 40 ఏళ్ళు అత్యంత నమ్మకస్తుడిగా పని చేశానని.. తన ఆత్మగౌరవానికి 2020 నుంచి భంగం కలిగించారని.. పీఎంవో, ఢిల్లీలో, పార్టీలో తనను అవమానకరంగా అంచెలంచెలుగా తగ్గించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల ప్రమేయం ఎలా పెరిగిందన్న విజయసాయిరెడ్డి.. సజ్జల రాజ్యాంగేతర శక్తిగా మారి, జగన్‌ను ఎవరూ కలవనీయకుండా చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి, బొత్స, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, తనను రీజనల్ కోఆర్డినేటర్స్ చేసి, సజ్జలను రాష్ట్ర పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా చేశారని.. తామంతా ఆయనకు రిపోర్టు చేయాలనే ఆదేశాలు తనకు నచ్చక, ఆత్మగౌరవం చంపుకుని పనిచేయలేక, రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా తాను బయటకు వచ్చానన్న విజయసాయిరెడ్డి.. ఈరోజు పార్టీ పెడతానంటే అదే కోటరీ తనను విమర్శిస్తోందని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. నేరుగా గెలిచేందుకే ప్రజాస్వామ్యబద్దంగా యుద్ధం చేస్తానన్న విజయసాయిరెడ్డి.. కోవర్టు రాజకీయం చేయడం తనకు చేతకాదన్నారు. 2022లో మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లీనరీలో తన మీద భౌతికంగా దాడి చేశారని.. ఈ విషయం జగన్‌కు తెలిసినా ప్రేక్షకపాత్ర వహించారని అన్నారు. 2022లోపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తల సమావేశంలో "సాయన్న వయసు అయిపోయింది ముసలోడు అయిపోయాడు" అంటూ అనుబంధ సంఘాల ఇంచార్జ్ బాధ్యతలు తనను తప్పించారని విజయసాయిరెడ్డి బహిరంగలేఖలో పేర్కొన్నారు.

ఆ తర్వాత జిల్లాల ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించారని.. కోర్ కమిటీలో నుంచి తొలగించారని.. మొత్తం 74 సార్లు ఇలాంటి అవమానాలు తనకు ఎదురయ్యాయని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. వైసీపీలో వైఎస్ జగన్ ఇప్పుడు నంబర్ 2గా మారారన్న విజయసాయిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుస్తుందా, ఓడుతుందా అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాను జగన్‌కు నమ్మక ద్రోహం చేయలేదని.. చేయను కూడా అంటూ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

పార్టీలో ఉండి, ఎవరు కోవర్టుగా పని చేస్తున్నారో, ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో వైసీపీ శ్రేణులు ఆలోచన చేసుకోవాలన్న విజయసాయిరెడ్డి.. మరో సందర్భంలో మరిన్ని విషయాలు వెల్లడిస్తానంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam