జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ సంచలన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. సిక్కింలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో..
చైనా సైన్యానికి తన ఏజెంట్లు పట్టుబడ్డారని, ఆ ఘటనతో తన కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నానని దోవల్ గుర్తు చేసుకున్నారు. అయితే, చివరకు విచారణలో తన తప్పేమీ లేదని తేలిందంటూ ఆయన వెల్లడించారు.
ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజిత్ దోవల్.. తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఈ ఘటనను విద్యార్థులతో పంచుకున్నారు. అప్పట్లో సిక్కింలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు తనకు అప్పగించారని, చైనా సరిహద్దు ప్రాంతాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలపై నిఘా పెట్టడం, సమాచారం సేకరించడం తన విధుల్లో భాగమని, ఓసారి సరిహద్దు ప్రాంతంలో నిఘా సమాచారం సేకరించేందుకు తన టీమ్‌ను పంపినట్లు దోవల్ తెలిపారు.
సిక్కిం సరిహద్దులకు వెళ్లి ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన తన బృందం.. 15 రోజులు గడిచినా తిరిగి రాలేదని, వారి ఆచూకీ కూడా తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ సమయంలో హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ రావడంతో అసలు విషయం తెలిసిందని, తన టీమ్‌ను చైనా సైన్యం పట్టుకుందని, వారిని విచారించిందని ఆయన చెప్పారు.
"ఈ ఘటనపై విచారణ మొదలవ్వడంతో నా కెరీర్ ముగిసిపోయినట్లేనని భావించాను. అయితే, విచారణలో నన్ను తప్పుబట్టలేదు. నా టీమ్‌కు హెడ్‌క్వార్టర్స్ నుంచి అందించిన మ్యాప్‌లు, స్కెచ్‌లలో తప్పులు ఉన్నట్లు విచారణలో తేలింది. నేను చేయాల్సింది సరిగ్గానే చేశాను. అయినప్పటికీ ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది" అని అజిత్ దోవల్ తెలిపారు.
ఆ సమయంలో తనతో పనిచేసిన ఓ టిబెటియన్ షెర్పా చెప్పిన మాటలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని దోవల్ చెప్పారు. మ్యాప్‌ను సరిగ్గా చదవడం ఎంత ముఖ్యమో చెబుతూ, ఆయన మూడు విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారని.. అవి ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకో, ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావో తెలుసుకో, అక్కడికి చేరుకోవడానికి ఏ మార్గంలో వెళ్లాలో తెలుసుకో అనే ఈ మూడు విషయాలు తన జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా మారాయని అజిత్ దోవల్ తెలిపారు.

