Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు

ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు

Telugu Samayam 2 hrs ago

ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం కనిపిస్తోంది.. ఈ ప్రభావంతో మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇవాళ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వర్షం పడే సమయంలో ఈదురుగాలులు, ఉరుముల ప్రభావం ఉంటుందని.. ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినా.. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయంటున్నారు, ఈనెల 23వ తేదీ తర్వాతే విస్తరించే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఈ నెలాఖరు నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనాలు ఉన్నాయి. అప్పటివరకూ మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడతాయంటున్నారు.

బుధవారం రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగగా.. మరికొన్నిచోట్ల వానలు పడ్డాయి. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడ్డాయి. విజయనగరం జిల్లా వేపాడలో 9.67 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 7.2, శ్రీసత్యసాయి జిల్లా బుక్కసముద్రంలో 6.9, నర్సీపట్నంలో 6.65, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 6.58, ప్రకాశం జిల్లా టంగుటూరులో 6.44 వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లాలో 5.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల భారీగా వానలు పడ్డాయి.

వర్షాల సంగతి అలా ఉంటే మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండల తీవ్రత కనిపించింది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. బాపట్లలో అత్యధికంగా 42.5 డిగ్రీలు, పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురం, నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా ఒంగోలుల్లో 42, అమరావతిలో 41.5, నెల్లూరులో 40.9, గన్నవరంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం మీద రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam