Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"ఆపరేషన్ చిన్నారి - తల్లి".. ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం..

"ఆపరేషన్ చిన్నారి - తల్లి".. ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం..

Telugu Samayam 2 weeks ago

రాష్ట్రంలోని మహిళలు, బాలికల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఏపీ మహిళా, శిశు భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం ప్రారంభించింది.

చిన్నారులపై లైంగిక దాడులు, నేరాలను అరికట్టేందుకు 2026 ఫిబ్రవరి నెలలో ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమానికి ఏపీ పోలీసులు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తాజాగా పంచుకున్నారు. ప్రతి చిన్నారి భద్రతే తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యంగా పేర్కొన్నారు. 'ఆపరేషన్ చిన్నారి తల్లి' కార్యక్రమం కింద.. చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. నేరాలకు పాల్పడే వారిని వేగంగా అరెస్ట్ చేయడమే కాకుండా, కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు.

ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం కింద.. పిల్లల్లో గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని.. వారు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని వంగలపూడి అనిత వివరించారు. పోక్సో బాధితులైన 2,083 మంది చిన్నారులకు కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించి వారికి అండగా నిలిచినట్లు హోం మంత్రి అనిత వివరించారు. మరోవైపు తప్పిపోయిన ఓ బాలికను విజయవాడ పోలీసులు రక్షించి, కుటుంబం చెంతకు చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులను అనిత అభినందించారు. సీసీటీవీ ఫుటేజీ, టెక్నికల్ నిఘా, పరస్పర సమన్వయంతో.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చారని ప్రశంసించారు. చిన్నారుల భద్రతకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న అనిత.. ఎవరి పిల్లలు అయినా కనిపించకుండాపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మరోవైపు సురక్షిత బాల్యం- సుస్థిర భవిష్యత్తు అనే ట్యాగ్‌లైన్‌తో ఏపీ మహిళా, శిశు భద్రతా విభాగం అధికారులు ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమాన్ని రూపొందించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడేవారు, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారినవారు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అలాగే హానికరమైన ప్రదేశాలలో ఉండే బాలికలు, వారి అమ్మలను అప్రమత్తం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు. ఈ కార్యక్రమం కింద అంగన్వాడీలు, పాఠశాలలు, వసతిగృహాల్లో గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌ మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam