Dailyhunt
'అదే జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. 100 రోజుల క్రితమే ఫిక్స్ అయ్యా': ఆదినారాయణరెడ్డి

'అదే జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. 100 రోజుల క్రితమే ఫిక్స్ అయ్యా': ఆదినారాయణరెడ్డి

Telugu Samayam 2 weeks ago

ప్రజలకంటే తనకు పదవులు ముఖ్యం కాదని.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి. తాను అనుకున్నట్లుగా వ్యవస్థ సరిగా లేకపోతే రాజీనామా చేస్తానన్నారు.

తాను కూడా కూటమిలో ఉన్నానని.. కానీ కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 100 రోజుల క్రితమే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరికొంతకాలం చూసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. కానీ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. జమ్మలమడుగులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తన నియోజకవర్గంలో పనులు కచ్చితంగా జరగాల్సిందేనని తేల్చి చెప్పారు.

గండికోట జలాశయం ముంపువాసుల సమస్యల్ని ఆదినారాయణరెడ్డి ప్రస్తావించారు. గండికోట జలాశయం కోసం త్యాగాలు చేసినవారి తరఫున పోరాడతానన్నారు.. వారికి న్యాయం చేయాలని కోరారు. ముంపువాసుల త్యాగంతోనే తమ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయన్నారు.. వారికి పరిహారం మొత్తం చెల్లించాలని కోరారు. శ్రీశైలం కుడి కాలువ నిర్మాణం, ఆర్టీపీపీలో ఉద్యోగాల వంటి సమస్యలపై తాను పోరాటం చేస్తున్నానన్నారు. స్థానికంగా కొన్ని రాజకీయ సమస్యలు ఉన్నాయని.. అవసరమైతే తాను పార్టీ పదవుల కంటే ప్రజలే ముఖ్యమని భావించే వ్యక్తిని అన్నారు.. రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. మంచిచేయకపోతే పార్టీ ఎలా బలపడుతుందని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో తనపై ఒక్క రేప్ కేసు తప్ప ఎన్నో కేసులు పెట్టి వేధించారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అప్పటి సీఎం చంద్రబాబు, తాను, బీటెక్ రవిపై ఆరోపణలు చేయడం బాధ కలిగించిందన్నారు. ముందు సీబీఐతో విచారణ చేయించాలని కోరిన వారే ఆ తర్వాత వద్దని చెప్పడం ఆశ్చర్యం కలిగిచిందన్నారు. ఇప్పుడేమో ఆదినారాయణ బ్యాచ్‌ హత్య చేయలేదని.. వివేకా కుమార్తె సునీత హస్తం ఉందని మాట మార్చారన్నారు. తాను గతంలో వైఎస్సార్‌సీపీలో పనిచేసినప్పుడు పార్టీ కోసం కష్టపడితే తననే తిరిగి దెబ్బకొట్టారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam