Advance Tax: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు గడువు దగ్గరపడుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను ముందస్తుంగా చెల్లించడం ద్వారా ఎలాంటి చిక్కులు ఎదురవకుండా ఉంటుంది.
డిసెంబర్ 15 తర్వాత భారీ పెనాల్టీలు పడే అవకాశమూ ఉంటుంది.
Advance Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. మీ అడ్వాన్స్ ట్యాక్స్‌ను చెల్లించే సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 15వ తేదీతో ముందస్తు పన్ను చెల్లింపు మూడో విడత గడువు ముగుస్తుంది. చివరి వరకు వేచి చూడకుండా మీకు వీలైనంత త్వరగా మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. డిసెంబర్ 15వ తేదీ లోగా మీ అడ్వాన్స్ ట్యాక్స్ మూడో విడత చెల్లించడంలో విఫలమైతే ఆ తర్వాత భారీగా జరిమానాలు కట్టాల్సి రావచ్చు. డిసెంబర్ 15 లోగా ఆదాయపు పన్నులో 75 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అసలు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఎవరు చెల్లించాలి. ఒక వేళ టైం లోపు చెల్లించక పోతే ఎంత మేర పెనాల్టీలు కట్టాల్సి రావచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి?

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన లిమిట్‌కు మించిన ఆదాయం వచ్చే వారు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారు పన్ను మినహాయింపుల కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. అయితే, అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటంటే రాబోయే ఆదాయాన్ని ముందుగానే అంచనే వేసి ముందస్తుగా ట్యాక్స్ చెల్లించడం. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా దశల వారీగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది. మొత్తంగా ఆర్థిక ఏడాదిలో నాలుగు సార్లు చెల్లించేందుకు వీలుంటుంది.
ఎవరు చెల్లించాలి?..

తమకు రాబోయే ఆదాయం అంచనా వేసినప్పుడు వారి ట్యాక్స్ రూ. 10 వేలు అంత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు సహా ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. అయితే, ఉద్యోగుల విషయంలో కంపెనీలే జీతాల నుంచి ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) కట్ చేస్తాయి. వారు ప్రత్యేకంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతర రాబడి మార్గాలు ఉంటే మాత్రం ఉద్యోగులు సైతం చెల్లించాలి.
ఆలస్యమైతే జరిమానాలు ఎంతుంటాయి?

నిర్దేశించిన టైం లోగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించని ట్యాక్స్ పేయర్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం పెనాల్టీలు విధిస్తుంది. సెక్షన్ 234సీ ప్రకారం చూసుకుంటే.. ఇచ్చిన గడువులోగా చెల్లించాల్సిన ట్యాక్స్ పై 1 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 234బీ ప్రకారం.. ఒక ఆర్థిక ఏడాది చివరి వరకు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్.. వారి చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులో 90 శాతం మించకపోయినా, అసలు మొత్తానికే చెల్లించకపోయినా కట్టాల్సిన బకాయిలపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ రూపంలో పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. సెక్షన్ 234ఏ ప్రకారం.. ఇచ్చిన గడువు తేదీ తర్వాత ఆలస్యంగా చెల్లించినట్లయితే.. బకాయిలపై నెలకు 1 శాతం వడ్డీ విధిస్తుంది. డిసెంబర్ 15వ తేదీ లోపు మూడో విడత అంటే 75 శాతం పన్ను చెల్లించక పోతే పన్ను బకాయిలపై 1 శాతం వడ్డీ రూపంలో కట్టాలి.

