హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) మరో కొత్త ఏసీ ఎలక్ట్రిక్ బస్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్‌రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ సర్వీస్ నడవనుంది. ముఖ్యంగా నగరంలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్ వైపు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఈ సర్వీస్ ఉపయోగపడనుంది.
ఈ కొత్త సర్వీసులో 100 శాతం ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వినియోగిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు పర్యావరణహితమైన ప్రజా రవాణా అందుబాటులోకి రానుంది. ప్రగతినగర్ కమాన్ నుంచి బయలుదేరిన బస్సులు బాచుపల్లి క్రాస్ రోడ్డు, మల్లంపేట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-4ఏ, ఎగ్జిట్-1 మీదుగా ప్రయాణిస్తాయి. అనంతరం సైయంట్ సిగ్నల్, ఐసీఐసీఐ సిగ్నల్ మీదుగా వేవ్‌రాక్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం ఉదయం నాలుగు ట్రిప్పులను ఏర్పాటు చేశారు. ప్రగతినగర్ కమాన్ నుంచి ఉదయం 7.45 గంటలకు, 8.15 గంటలకు, 9.15 గంటలకు, 10.15 గంటలకు బస్సులు బయలుదేరనున్నాయి. ఉదయం వేళ ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ సర్వీసులు అందుబాటులో ఉండేలా సమయాలను రూపొందించారు.
వేవ్‌రాక్ నుంచి తిరుగు ప్రయాణానికి సాయంత్రం మూడు ట్రిప్పులను నడపనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు, 5.15 గంటలకు, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. దీంతో ఆఫీస్ అవర్స్ పూర్తయిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం లభించనుంది. ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట తదితర ప్రాంతాల్లో నివసిస్తూ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారికి ఈ సర్వీస్ ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. సాధారణంగా ఈ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లే ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలు, క్యాబ్‌లు లేదా పలు మార్గాల్లో మారాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓఆర్‌ఆర్ మీదుగా నేరుగా సర్వీస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం, మార్గమధ్యంలో వాహనాల మార్పు వంటి ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికుల స్పందనను బట్టి భవిష్యత్తులో ట్రిప్పుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది.

