Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అజిత్ అగార్కర్ రాజీనామా చేశాడా.. రోహిత్ శర్మ వివాదమే కారణమా?

అజిత్ అగార్కర్ రాజీనామా చేశాడా.. రోహిత్ శర్మ వివాదమే కారణమా?

టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిపోయిందా? వెస్టిండీస్‌తో సిరీస్ కోసం ప్రకటించిన జట్టే అతడి హయాంలో చివరిది కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

బీసీసీఐ అధికారికంగా ఈ విషయం ప్రకటించినప్పటికీ.. అగార్కర్ ఇకపై ఆ పదవిలో కొనసాగబోడని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐకి చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను పొడిగించే ఉద్దేశం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో అగార్కర్ కూడా తనకు కొనసాగే ఆసక్తి లేదని చెప్పినట్లు సమాచారం. కీలకమైన టీమిండియా రివ్యూ మీటింగ్‌కు కూడా అగార్కర్ హాజరుకాకపోవడంతో రాజీనామా వార్తలకు బలం చేకూరింది!

వాస్తవానికి అజిత్ అగార్కర్.. వన్డే ప్రపంచకప్ 2027 వరకు పదవిలో ఉంటాడని అంతా భావించారు. కానీ ఇంగ్లాండ్ టూర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇంగ్లాండ్‌తో వైట్ బాల్ సిరీస్‌కు ముందు, లార్డ్స్ వన్డే తర్వాత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కన పెట్టాలని అగార్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ భావించింది. 2027 వన్డే వరల్డ్ కప్‌లో యశస్వి జైశ్వాల్‌ను సిద్ధం చేయడానికి కనీసం 20 మ్యాచ్‌లు ఇవ్వాలని అగార్కర్ భావించాడు. ఈ నిర్ణయాన్ని రోహిత్ శ్రేయోభిలాషి, దక్షిన జోన్ సెలెక్టర్ ప్రగ్యాన్ ఓజా ద్వారా రోహిత్‌కు చెప్పించారు.

ఇక్కడే అసలు సమస్య వచ్చింది. 2027 వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్న రోహిత్ శర్మ బీసీసీఐ పెద్దలతో మాట్లాడి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బోర్డు తక్షణమే రోహిత్‌కు మద్దతుగా అధికారిక ప్రకటన విడుదల చేయడంతో అగార్కర్ తీవ్ర అసహనానికి, కోపానికి గురయ్యాడు. అప్పటి నుంచి బీసీసీఐకి.. అగార్కర్‌కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో అగార్కర్‌కు తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చాయి! గాయపడిన ఆటగాళ్ల రికవరీ విధానాలు, ఇండియా-ఎ జట్ల మ్యాచ్ షెడ్యూలింగ్ విషయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రధానంగా ఇరానీ కప్ మ్యాచ్‌లతో ఇండియా-ఎ మ్యాచ్‌లు ఓవర్‌లాప్ కావడం, ఏషియన్ గేమ్స్‌కు మొదటి శ్రేణి జట్టును పంపడంపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అంతేకాకుండా గాయపడిన ఆటగాళ్ల జాబితా మీడియాకు లీక్ కావడం పట్ల లక్ష్మణ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ, లక్ష్మణ్‌తో విభేదాలతో అగార్కర్ తాను వైదొలగడమే ఉత్తమమని భావించినట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam