Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మరో ఛాన్స్.. నవంబర్‌ 30 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంపు

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మరో ఛాన్స్.. నవంబర్‌ 30 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంపు

Telugu Samayam 1 week ago

తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, ఛార్జీల చెల్లింపునకు నవంబర్‌ 30వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ ఫీజులపై ఇప్పటికే అమలులో ఉన్న 25 శాతం రాయితీని కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీఓ ఎంఎస్ నంబర్ 213ను విడుదల చేశారు.

రాష్ట్రంలో అనుమతిలేని లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25.70 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులపై మొదట 50 శాతం.. ఆ తర్వాత 25 శాతం రాయితీ ప్రకటించింది.

ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. మరోవైపు.. ఫీజులు చెల్లించిన దరఖాస్తులను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్లానింగ్ అధికారులు.. ఇతర సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైంది.

ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినా.. ఇప్పటివరకు సుమారు రూ.2 వేల కోట్ల మేరకే వసూళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు మరో అవకాశం కల్పిస్తూ ఆగస్ట్ 1వ తేదీ నుంచి నవంబర్‌ 30 వరకు నాలుగు నెలల పాటు గడువు పొడిగించింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుని ఫీజులు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. సంబంధిత శాఖలు ఉత్తర్వులను వెంటనే అమలు చేసి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam