Dailyhunt
అమెరికా దాడులను అడ్డుకునేందుకు పౌరులనే అస్త్రాలుగా మలిచిన ఇరాన్.. వాటి చుట్టూ నిలబెట్టి మరీ..!

అమెరికా దాడులను అడ్డుకునేందుకు పౌరులనే అస్త్రాలుగా మలిచిన ఇరాన్.. వాటి చుట్టూ నిలబెట్టి మరీ..!

Telugu Samayam 3 days ago

Iran Human Chain Energy Sites: పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధం తీవ్రమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు ముగుస్తున్న తరుణంలో..

ఇరాన్ ఒక అత్యంత సాహసోపేతమైన, వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. తమ దేశ ఆర్థిక మూలాధారాలైన చమురు, గ్యాస్, అణుశక్తి కేంద్రాలపై అమెరికా దాడులు చేయకుండా అడ్డుకునేందుకు లక్షలాది మంది యువతతో మానవ హారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా వాటన్నింటి చుట్టూ పౌరులను నిల్చోబెట్టి దాడులు అడ్డుకోవాలని చూస్తోంది.

"బ్రైట్ ఫ్యూచర్" పేరుతో ప్రదర్శన..

ఇరాన్ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి (స్థానిక కాలమానం ప్రకారం) దేశవ్యాప్తంగా అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు భారీ ఎత్తున రోడ్లపైకి రానున్నారు. ప్రధానంగా దేశంలోని కీలక మౌలిక సదుపాయాల చుట్టూ చేతులు కలిపి నిలబడనున్నారు. "ప్రజా మౌలిక సదుపాయాలపై దాడి చేయడం యుద్ధ నేరం అని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా యువతే స్వయంగా ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు" అని ఇరాన్ యువజన వ్యవహారాల డిప్యూటీ అలీరెజా రహీమి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రదర్శనకు.. ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవ హారం (హ్యూమల్ చైన్ ఆఫ్ ఇరాన్ యూత్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్) అని పేరు పెట్టారు.

మరోవైపు వైట్‌హౌస్ నుంచి ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల లోపు (అమెరికా కాలమానం ప్రకారం) హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ ఒక్క రాత్రిలో తుడిచి పెట్టుకుపోతుందని హెచ్చరించారు. "ఒక దేశాన్ని ఒక్క రాత్రిలో మ్యాప్ నుంచి తొలగించగల శక్తి మాకుంది. ఆ రాత్రి రేపే కావచ్చు" అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే అది యుద్ధ నేరం కిందకు వస్తుందన్న వాదనలను ట్రంప్ కొట్టిపారేశారు. తన దేశ ప్రయోజనాల కోసం అలాంటి చర్యలకు తాను ఏమాత్రం వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు.

కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరణ..

ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తులు (పాకిస్థాన్, ఈజిప్ట్) ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తాజాగా తిరస్కరించింది. తమకు తాత్కాలిక శాంతి అవసరం లేదని, యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని ఇరాన్ పట్టుబడుతోంది. భవిష్యత్తులో అమెరికా నుంచి మళ్లీ దాడులు జరగవని గ్యారెంటీ ఇస్తేనే తాము వెనక్కి తగ్గుతామని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తబా ఫెర్దౌసీ పూర్ స్పష్టం చేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam