మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేస్తోంది. ఇరాన్, లిబియా, సిరియా ఇలా మధ్యప్రాచ్య దేశాలతో పోరాడేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా ఒక్కటే అండగా ఉన్న ఏకైక శక్తివంతమైన దేశం అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు చేసిన సమయంలో..
ఇజ్రాయెల్ ప్రధాని తమకు భారత్ కూడా అండగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి తమకు అపారమైన మద్దతు లభిస్తోందని నెతన్యాహు అనడం ఆసక్తికరంగా మారింది.
అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ తమకు కేవలం అమెరికా ఒక్కటే మిత్రదేశం కాదని, ఇంకొన్ని దేశాలు కూడా ఉన్నాయని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ నుంచి తమకు అద్భుతమైన మద్దతు లభిస్తోందని నెతన్యాహు గర్వంగా చెప్పుకొన్నారు. సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో కూడా భారతీయుల నుంచి ఇజ్రాయెల్‌కు విపరీతమైన మద్దతు వస్తోందని చెప్పారు.
భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నెతన్యాహు మధ్య కూడా మంచి వ్యక్తిగత సంబంధమే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ తన వ్యక్తిగత మిత్రుడు అంటూ నెతన్యాహు అనడం, భారత్‌ను ప్రపంచ శక్తిగా కొనియాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా భారత్ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందని ప్రకటించడం విశేషం.
READ ALSO ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారులు.. అసలైన వారసుడు మాత్రం దూరం, మొజ్తబా ఎక్కడ?
అయితే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పుడు భారత్‌పై ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం.. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలే. ఇజ్రాయెల్‌కు ప్రస్తుతం ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికానే అని, అలాంటి దేశాన్ని విమర్శించడం సరైంది కాదూ అని జేడీ వాన్స్ అనడంతో.. తమకు అమెరికాతో పాటు భారత్ కూడా శక్తివంతమైన మిత్రదేశమే అంటూ నెతన్యాహు అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అమెరికా తయారు చేసిన ఆయుధాలే గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌ను రక్షిస్తున్నాయని, వాటికి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బే ఖర్చవుతోందని కూడా ఆయన అన్నారు. వాన్స్‌పై గౌరవం ఉన్నప్పటికీ, ఆయన చెప్పే ప్రతి విషయంతో తాను ఏకీభవించనని నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు తమ సైనిక వ్యూహాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ భద్రత రంగాల్లో ఇజ్రాయెల్ సహకారం కోరుతున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం దగ్గర నుంచి అమెరికా - ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి అనిపిస్తోంది.

