అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సత్తా మరోసారి ప్రపంచస్థాయిలో చాటుకుంది. న్యూజెర్సీలోని పార్సిప్పనీ పట్టణంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
మొత్తం 1,383 అమెరికా జెండాలను ఫ్లాగ్‌పోల్స్‌పై ఏర్పాటు చేసి భారీ స్థాయిలో '250' అనే సంఖ్యను రూపొందించడం ద్వారా 'లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్' విభాగంలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆగస్ట్ 15వ తేదీన పార్సిప్పనీ, న్యూజెర్సీలోని వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో ఈ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా జెండాలతో రూపొందించిన భారీ 250 సంఖ్య చుట్టూ భారత త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు. భారత్, అమెరికా దేశాల చారిత్రక సంబంధాలు, ఇరు దేశాల స్వాతంత్య్ర వేడుకలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ వేడుకను India@80, America@250 అనే రెండు వార్షికోత్సవాల నేపథ్యంలో నిర్వహించారు.
ఈ రికార్డు ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించి ధ్రువీకరించారు. ఆ తర్వాత అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ రికార్డు సర్టిఫికెట్‌ను ఎఫ్ఐఏ నాయకులు అందజేశారు. దీంతో ఈ కార్యక్రమం భారతీయ-అమెరికన్ సమాజానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ గిన్నిస్ రికార్డు భారతీయ సమాజం ఐక్యత, వారసత్వంపై ఉన్న గర్వానికి నిదర్శనమని ఎఫ్ఐఏ ఛైర్మన్ అంకుర్ వైద్య తెలిపారు. అందరూ ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చో ఈ రికార్డు నిరూపించిందని పేర్కొన్నారు.
ఈ రికార్డు భారత్-అమెరికా వ్యూహాత్మక స్నేహానికి ప్రతీకగా నిలుస్తుందని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ అంబాసిడర్ బినయ శ్రీకాంత ప్రధాన్ తెలిపారు. రెండు ప్రజాస్వామ్య దేశాలను కలుపుతున్న భారతీయ-అమెరికన్ ప్రవాస సమాజానికి ఇది ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. పార్సిప్పనీ మేయర్ పుల్కిత్ దేశాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారత్, అమెరికా మధ్య ఉన్న సారూప్యతను ప్రస్తావించారు. న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ డేల్ జీ. కాల్డ్‌వెల్ కార్యక్రమం వెనుక ఉన్న భారీ స్వచ్ఛంద సేవా కృషిని ప్రశంసించారు.
ఈ ప్రపంచ రికార్డు ఒక్క సంస్థకు మాత్రమే చెందదని, కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి వాలంటీర్, భాగస్వామి, మద్దతుదారుడి విజయమని ఎఫ్ఐఏ అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి తెలిపారు. భారీ సంఖ్యలో ఫ్లాగ్‌పోల్స్‌తో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఐక్యత, దేశభక్తి, ప్రపంచ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు గిన్నిస్ రికార్డు సాధించిన భారీ జెండా ప్రదర్శనను ప్రజలకు చూపించారు. 1970లో స్థాపించబడిన ఎఫ్ఐఏ.. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ-అమెరికన్ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ లాభాపేక్షలేని సంస్థగా కొనసాగుతోంది.

